IPL 2022: ఢిల్లీకి వరుస పరాజయాలు.. రిమోట్లు, బాటిళ్లు పగులగొడుతున్న హెడ్ కోచ్ పాంటింగ్

Published : Apr 27, 2022, 08:01 PM IST
IPL 2022: ఢిల్లీకి వరుస పరాజయాలు.. రిమోట్లు, బాటిళ్లు పగులగొడుతున్న హెడ్ కోచ్ పాంటింగ్

సారాంశం

TATA IPL 2022: ఈ సీజన్ లో  ఏడు  మ్యాచులాడిన ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగింట్లో ఓడింది. అయితే తన జట్టు వరుస వైఫల్యాలపై ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నాడు. రూముల్లో ఉన్న టీవీలు, రిమోట్లు, వాటర్ బాటిళ్లు పగులగొడుతున్నాడట.

ఐపీఎల్ లో గతేడాది అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి మాత్రం తేలిపోతున్నది. ఈ సీజన్ లో ఏడు మ్యాచులు ఆడి మూడింట్లో నెగ్గి నాలుగింట్లో ఓటమి పాలైంది. చివరిగా ఆ జట్టు  రాజస్తాన్ రాయల్స్ తో ముగిసిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో  15 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే తమ జట్టు ప్రదర్శనపై ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఆగ్రహంగా ఉన్నాడట. తన  గదిలో మ్యాచ్ ను చూస్తూ.. రిమోట్, వాటర్ బాటిళ్లను పగులగొట్టాడట. ఈ విషయాన్ని  స్వయంగా పాంటింగే వెల్లడించాడు.  

ఢిల్లీ క్యాపిటల్స్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో రికీ స్పందిస్తూ.. ‘ఆ మ్యాచ్ చూస్తుండగా నేను చాలా ఫ్రస్టేట్ అయ్యాను. ఢిల్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆఖర్లో చాలా అసహనానికి లోనయ్యాను. ఇక ఆఖరి ఓవర్లో అయితే నా ఫ్రస్టేషన్ పీక్ కు వెళ్లింది. 

ఆ సమయంలో నేను కోపాన్ని అదుపుచేసుకోలేకపోయాను.  నాకు తెలిసి3 లేదా నాలుగు టీవీ రిమోట్లు, నాలుగైదు వాటర్ బాటిళ్లు పగులగొట్టి ఉంటాను.   కోపాన్ని ఆపుకోలేక వాటిని  గదిలో ఉన్న  గోడకు విసరగొట్టాను..’అని చెప్పుకొచ్చాడు. 

 

హై ఓల్జేజీ డ్రామా సాగిన ఢిల్లీ-రాజస్తాన్ మ్యాచ్ లో  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన  సంజూ శాంసన్  సేన నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.  జోస్ బట్లర్ (116), పడిక్కల్ (54), శాంసన్ (46 నాటౌట్) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 207 పరుగులే చేయగలిగింది. అయితే ఆఖరి ఓవర్లో 36 పరుగులు అవసరముందనగా  మ్యాచ్ లో హైడ్రామా సాగింది. 

ఒబెడ్ మెక్ కాయ్ వేసిన ఆ ఓవర్లో.. తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు రొవ్మెన్ పావెల్. అయితే మూడో బంతి.. నడుము కంటే ఎక్కువ ఎత్తులో వచ్చినా  దానిని అంపైర్ నోబాల్ గా ఇవ్వలేదు. దీంతో  ఢిల్లీ డగౌట్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.   క్రీజులో ఉన్న పావెల్,  కుల్దీప్ యాదవ్ లను అక్కడ్నుంచి రావాలని  రిషభ్ పంత్ పిలవడం, ఫీల్డ్ అంపైర్ లతో వాగ్వాదం,  ఆ తర్వాత ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే ఏకంగా  ఫీల్డ్ లోకి ప్రవేశించి అంపైర్ తో చర్చించడం తీవ్ర వివాదాస్పదమయ్యాయి.  ఈ  ఓవర్లో మూడో బంతి తర్వాత లయతప్పిన  పావెల్ తర్వాత రాణించలేకపోయాడు. ఫలితంగా ఢిల్లీ 15 పరుగుల తేడాతో ఓడింది. 

కాగా.. ఈ  మ్యాచ్ కు ముందు రికీ పాంటింగ్ కుటుంబంలో  ఒకరికి కరోనా సోకడంతో అతడు కూడా క్వారంటైన్  కు వెళ్లాడు. దీంతో హెడ్ కోచ్ లేకుండానే  ఢిల్లీ ఆ  మ్యాచ్ ఆడింది. అయితే  తాను ప్రత్యక్షంగా అందుబాటులో లేకున్నా టెక్స్ట్ మెసేజ్ ల ద్వారా జట్టు కోచింగ్ సభ్యులతో  సమన్వయం చేసుకున్నానని  పాంటింగ్ తెలిపాడు. ప్రస్తుతం పాంటింగ్ క్వారంటైన్ ముగించుకుని తిరిగి జట్టుతో చేరాడు. ఈ సీజన్ లో ఢిల్లీ తర్వాత మ్యాచ్..  గురువారం  కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. ప్లేఆఫ్ ఆశలు నిలుపుకోవాలంటే ఇక పై ఢిల్లీ ఆడబోయే ప్రతి మ్యాచ్ ఆ జట్టుకు ఎంతో కీలకం కానున్నది. 

PREV
click me!

Recommended Stories

Hardik Pandya : చౌకబారు సెన్సేషన్ కోసం.. మీకేంట్రా ఇదంతా? హార్దిక్ పాండ్యా ఫైర్
గంభీర్ ఒక్కడే కాదు.. టీమ్ అందరిదీ తప్పే.! టీమిండియాను ఏకీపారేశాడుగా