అశ్విన్‌కు లేరు సాటి.. 800 వికెట్లు గ్యారెంటీ: మురళీధర్ ప్రశంసలు

By Siva KodatiFirst Published Jan 14, 2021, 3:50 PM IST
Highlights

టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ప్రశంసలు కురిపించాడు శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్. ప్రస్తుత స్పిన్నర్లలో అశ్వినే అత్యుత్తమ ఆటగాడని, అతనొక్కడే టెస్టుల్లో 700-800 వికెట్లు తీస్తాడని జోస్యం చెప్పాడు.

టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ప్రశంసలు కురిపించాడు శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్. ప్రస్తుత స్పిన్నర్లలో అశ్వినే అత్యుత్తమ ఆటగాడని, అతనొక్కడే టెస్టుల్లో 700-800 వికెట్లు తీస్తాడని జోస్యం చెప్పాడు. ఇదే సమయంలో ఆసీస్ స్పిన్నర్‌ నాథన్‌ లైయన్‌‌లో అంత సామర్ధ్యం లేదన్నాడు. టెలిగ్రాఫ్‌కు రాసిన ఓ కథనంలో మురళీధరన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

అశ్విన్ గొప్ప స్పిన్నర్‌‌ అన్న ముత్తయ్య.. మరే బౌలర్‌ కూడా ఆ మార్కును అందుకోలేడని వెల్లడించాడు. టీ20, వన్డే మ్యాచ్‌లు టెస్టు క్రికెట్‌ పరిస్థితుల్ని మార్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

తాను క్రికెట్‌లో వున్న రోజుల్లో టెక్నికల్‌గా బ్యాట్స్‌మెన్‌ ఎంతో బాగా ఆడేవారని, అప్పుడు వికెట్లు కూడా ఫ్లాట్‌గా ఉండేవని ముత్తయ్య గుర్తుచేసుకున్నాడు. ఇప్పుడు టెస్టు మ్యాచ్‌లు మూడు రోజుల్లోనే పూర్తవుతున్నాయని, అప్పట్లో వికెట్లు తీయాలంటే బౌలర్లు చాలా కష్టపడేవారని చెప్పాడు.

వికెట్ల కోసం వైవిధ్యమైన బంతులు వేసేవారమని పేర్కొన్నాడు. ఇప్పుడు సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేస్తే వికెట్లు వాటంతట అవే వస్తాయని అభిప్రాయపడ్డాడు.. ఇప్పుడు బ్యాట్స్‌మెన్‌ ఎక్కువసేపు అటాకింగ్‌ చేయకుండా ఉండలేరని, దాంతో వికెట్లు తీయడం సులువుగా మారిందని మురళీధరన్ చెప్పాడు.

తన రోజుల్లో కూడా డీఆర్‌ఎస్‌ ఉండి ఉంటే తాను 800 కన్నా ఎక్కువ వికెట్లు తీసేవాడినని ఆయన అభిప్రాయపడ్డాడు. కాగా అశ్విన్‌ ప్రస్తుతం 74 టెస్టుల్లో 377 వికెట్లతో కొనసాగుతుండగా.. ఆసీస్‌ స్పిన్నర్‌ లైయన్‌ 99 టెస్టుల్లో 396 వికెట్లు తీశాడు.

click me!