కొడతాను, నెడతాను, నాది క్రూరమైన ప్రేమ.. అందుకే యువరాజ్‌ని: అక్తర్

By Siva KodatiFirst Published Aug 7, 2020, 6:17 PM IST
Highlights

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అప్పుడప్పుడు తన క్రీడా జీవితంలోని జ్ఞాపకాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటాడు.

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అప్పుడప్పుడు తన క్రీడా జీవితంలోని జ్ఞాపకాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటాడు. తాజాగా భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్‌ను గాయపరిచిన ఘటనను గుర్తుచేసుకున్నాడు.

తన ప్రేమ కొంచెం క్రూరంగా ఉంటుందని.. తాను ఎవర్నయినా ప్రేమిస్తే వారిని నెడుతూ, కొడుతూ మాట్లాడతానని అక్తర్ చెప్పాడు. భారత్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో తాను యువరాజ్‌ సింగ్‌తో ఇలాగే ప్రవర్తించానని, ప్రేమతో చేసిన పనిలో కొంచెం హద్దు మీరానని.. దాంతో పొరపాటున యువరాజ్ వెన్నుకు గాయమైందని తెలిపాడు.

అంతేకాకుండా షాహిద్ ఆఫ్రిదిని హత్తుకునే ప్రయత్నంలో అతనిని కొంచెం గట్టిగా పట్టుకోవడంతో ఒక పక్కటెముక విరిగిపోవడం, అబ్ధుల్ రజాక్‌కు ప్రేమతో స్ట్రెచ్చింగ్ చేయిస్తున్న సమయంలో అనుకోకుండా నరం మెలికపడటం లాంటివి చోటు చేసుకున్నాయని అక్తర్ చెప్పుకొచ్చాడు.

ఇవన్నీ కూడా ప్రేమతో సరదాగా చేశానని తెలిపాడు. మరోవైపు గతవారం భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌పై అక్తర్ విరుచుపడిన సంగతి తెలిసిందే. భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో షోయబ్.. అదే పనిగా స్లెడ్జింగ్ చేయడంతో సెహ్వాగ్ అతనిపై విమర్శలు చేశాడు.

అదే పనిగా బౌన్సర్లు వేస్తూ హుక్ షాట్ కొట్టమని రెచ్చగొడుతున్నాడని.. దీంతో విసిగిపోయిన తాను నాన్ స్ట్రైకర్ వైపు మీ బాబు నిలబడి వున్నాడు.. అతనికి చెప్పు అతడు కొట్టి చూపిస్తాడు.. నాన్‌స్ట్రైకర్‌లో సచిన్ వున్నాడు’’ అంటూ పేర్కొన్నాడు.

దీనిపై స్పందించిన అక్తర్.. సెహ్వాగ్ ఒకవేళ నిజంగా ఆ మాట అని ఉంటే తాను వదిలిపెట్టేవాడినా.. కచ్చితంగా గ్రౌండ్‌లోనే చితకబాదేవాడినని.. తర్వాత హోటల్‌లో కూడా కొట్టేవాడినంటూ వివాదాస్పద  వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై వీరేంద్రుడు ఇంకా స్పందించలేదు. 

click me!