
దశాబ్ధాల పోరాట ఫలితంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ బుధవారం భూమిపూజ చేశారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించాడు.
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో డిస్‌ప్లే చేసిన రామమందిరం ఫోటోను షేర్ చేసి దానికి జై శ్రీరామ్ అనే శీర్షికను జోడించాడు. శ్రీరాముడి అందం పేరులో కాకుండా వ్యక్తిత్వంలో దాగివుందని, మంచితనానికి, సౌభ్రాతృత్వానికి, ఐకమత్యానికి ఆయన ప్రతీక అని కనేరియా పేర్కొన్నాడు.
రామ మందిరానికి భూమి పూజ కారణంగా ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఆనందంగా ఉన్నారని ఆయన చెప్పాడు. కాగా పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టులో ఆడిన రెండవ హిందూ క్రికెటర్ డానిష్ కనేరియా.
ఇంతకు ముందు అనిల్ దల్‌పత్ అనే హిందూ బౌలర్ 1980వ దశకంలో పాకిస్తాన్ జట్టు తరపున ఆడాడు. రామమందిరానికి సంబంధించి కనేరియా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన అభిమానులు మాత్రం కనేరియా భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడటంతో కనేరియాపై జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. నిషేధాన్ని ఎత్తివేయాలని పాక్ క్రికెట్ బోర్డును కోరానని, తాను ఒక హిందువును అయినందునే పీసీబీలో మద్ధతు దొరకడం లేదని చెప్పాడు.