
బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లాండ్ టెస్టు జట్టు జోరు కొనసాగుతున్నది. గతేడాది జూన్ నుంచి ‘బజ్‌బాల్’ ఆటతో టెస్టు క్రికెట్ స్వరూపాన్నే మార్చేస్తున్న ఇంగ్లాండ్.. తాజాగా న్యూజిలాండ్ తోనూ రెచ్చిపోతున్నది. తొలి టెస్టులో స్వదేశంలో న్యూజిలాండ్ ను కోలుకోలేని దెబ్బతీసిన ఇంగ్లీష్ జట్టు.. రెండో టెస్టులోనూ అదే దూకుడును ప్రదర్శిస్తున్నది. వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజే 65 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 315 పరుగుల స్కోరు చేసింది. ఇంగ్లాండ్ యువ ఆటగాడు హ్యరీ బ్రూక్ (169 బంతుల్లో 184 నాటౌట్, 24 ఫోర్లు, 5 సిక్సర్లు) కు తోడు జో రూట్ (182 బంతుల్లో 101 నాటౌట్, 7 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు.
రెండో టెస్టులో టాస్ గెలిచిన కివీస్.. ఇంగ్లాండ్ కు బ్యాటింగ్ అప్పగించింది. తొలుత ఇంగ్లాండ్ కు భారీ షాక్ తాకింది. ఆ జట్టు ఓపెనర్లు జాక్ క్రాలే (2), బెన్ డకెట్ (9) లతో పాటు ఓలీ పోప్ (10) కూడా విఫలమయ్యారు. కానీ మాజీ సారథి జో రూట్ సాయంతో బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఆది నుంచి దూకుడుగా ఆడిన బ్రూక్.. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. 107 బంతుల్లోనే అతడి సెంచరీ పూర్తయింది. ఫిఫ్టీ, హండ్రెడ్ లను ఫోర్ కొట్టి చేరుకున్న బ్రూక్.. 150 ని కూడా అదే విధంగా సాధించడం గమనార్హం. బ్రూక్ కివీస్ బౌలర్లను దంచికొడుతుంటే రూట్ మాత్రం నింపాదిగా ఆడాడు. సింగిల్స్, డబుల్స్ తో సెంచరీకి చేరుకున్నాడు.
ఈ మ్యాచ్ లో రూట్ సెంచరీ తర్వాత 65వ ఓవర్లో వర్షం ఆరంభమైంది. అప్పటికీ బ్రూక్.. డబుల్ సెంచరీకి 16 పరుగుల దూరంలోనే నిలిచాడు. వర్షం గనక అంతరాయం కలిగించకుంటే అతడు ద్విశతకం సాధించేవాడే. మరో 25 ఓవర్ల ఆట వర్షార్పణమైంది. ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడం ద్వారా బ్రూక్ ఓ రికార్డును అందుకున్నాడు.
ప్రస్తుతం అతడికి న్యూజిలాండ్ తో ఆడుతున్న టెస్టు ఆరో టెస్టు కావడం గమనార్హం. గతేడాది పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ టీమ్ లో అతడు సెంచరీల మోత మోగించడమే గాక రికార్డుల దుమ్ము దులిపాడు. ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్ లలో కలిపి 807 పరుగులు చేశాడు. తద్వారా భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ పేరిట ఉన్న ఓ రికార్డును చెరిపేశాడు. కాంబ్లీ.. తొలి 9 ఇన్నింగ్స్ లలో 798 పరుగులు చేశాడు. ఇప్పటివరకూ ఇదే రికార్డు. తాజాగా బ్రూక్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు.