నా కన్నీళ్లను దేశం చూడటం నాకు ఇష్టం లేదు.. కానీ మమ్మల్ని మళ్లీ ఇలా చూడరు.. ఇది నా హామీ : హర్మన్‌ప్రీత్

Published : Feb 24, 2023, 10:47 AM IST
నా కన్నీళ్లను దేశం చూడటం నాకు ఇష్టం లేదు.. కానీ మమ్మల్ని మళ్లీ ఇలా చూడరు.. ఇది నా హామీ : హర్మన్‌ప్రీత్

సారాంశం

ICC Womens T20 World Cup 2023: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ లో  భారత జట్టు సెమీస్ లో ఆసీస్ చేతిలో ఓడిన  విషయం తెలిసిందే.  హర్మన్‌ప్రీత్ - జెమీమా పోరాడినా  భారత్ కు  నిరాశ తప్పలేదు. 

ఐసీసీ   మహిళల  టీ20  ప్రపంచకప్ లో  భారత జట్టు మరోసారి ఆసీస్ చేతిలో ఓడి టీమిండియా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సెమీఫైనల్లో భారత్.. ఆసీస్ చేతిలో ఐదు పరుగుల తేడాతో  ఓడింది.  భారత బౌలర్లు విఫలమైనా  బ్యాటింగ్ లో   పోరాడిన  హర్మన్‌ప్రీత్ - జెమీమా రోడ్రిగ్స్ లు మెరవడంతో   ఒకదశలో ఈ  మ్యాచ్ లో భారత్ ఈజీ విక్టరీ కొట్టగలదని అనిపించింది.  కానీ హర్మన్ రనౌట్  తో  టీమిండియా ఆశలు తలకిందులయ్యాయి. 

మ్యాచ్ ముగిశాక హర్మన్ చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో  ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.   సెమీస్ లో ఓడటంతో  తీవ్ర నిరాశకు గురైన  హర్మన్.. ధారగా వస్తున్న కన్నీటిని  ఆపుకుని   మాట్లాడింది.  మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమె ఆ బాధను  కనబడనీయకుండా  గ్లాసెస్ ను ధరించింది. 

ఈ సందర్భంగా హర్మన్ మాట్లాడుతూ.. ‘నేను ఏడుస్తున్న  దృశ్యాలను నా దేశం చూడటం నాకిష్టం లేదు.  అందుకే గ్లాసెస్ ధరించా.  అయితే నేను గ్లాసెస్ ను పెట్టుకుని కన్నీటిని కనబడనీయకుండా దాచుకుంటున్నా.. మరోసారి నా దేశాన్ని మాత్రం ఈ స్థితిలో  ఉండనీయను అని ప్రామిస్ చేస్తున్నా. ఈ ఓటమి నుంచి మేం గుణపాఠం నేర్చుకుంటాం. తిరిగి  పుంజుకుంటాం..’అని భావోద్వేగంతో చెప్పింది. 

 

ఇక  మ్యాచ్  తర్వాత నిర్వహించే ప్రెస్  కాన్ఫరెన్స్ లో కూడా హర్మన్  అదే  భావోద్వేగంతో మాట్లాడింది.   తనతో కలిసి  పోరాడిన జెమీమా  పోరాటాన్ని కొనియాడింది.  ‘ఈ మ్యాచ్ లో జెమీమా చాలా అద్భుతంగా ఆడింది. జట్టుకు ఏం కావాలనుకుంటున్నామో  తనకు తెలుసు. అదే విధంగా ఆమె బ్యాటింగ్ సాగింది.  ఇటువంటి ప్రదర్శనలు చాలా ముఖ్యం..’అని తెలిపింది. 

ఇక ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ తప్పిదాలు తమను దారుణంగా దెబ్బతీశాయని హర్మన్ చెప్పుకొచ్చింది.   ఫీల్డింగ్ లో తాము తమ స్థాయికి తగ్గట్టుగా ఆడలేదని.. కీలక క్యాచ్ లు వదిలేశామని  ఆందోళన వ్యక్తం చేసింది. సెమీస్ లో ఇలా ఆడాల్సింది కాదని..  అయితే తాము ఈ  తప్పుల నుంచి నేర్చుకున్నామని.. వాటిని పునరావృతం కాకుండా చూసుకుంటామని  తెలిపింది.  

 

ఆసీస్ తో సెమీస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూలు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేశారు.   ఆ తర్వాత  భారత జట్టు..  20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగుల వద్దే ఆగిపోయింది.   కీలక మ్యాచ్ లో ఓపెనర్లు షఫాలీ వర్మ (9), స్మృతి మంధాన (2), యస్తికా భాటియా (4)  నిరాశపరిచారు.  జెమీమా (43), హర్మన్ (52) రాణించారు. కానీ హర్మన్ రనౌట్ తో పరిస్థితి తలకిందులయ్యింది. రిచా ఘోష్, దీప్తి శర్మ లు  విజయం కోసం యత్నించినా  భారత్ విజయానికి  ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయింది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు