Hardik Pandya: అదే మా సక్సెస్ మంత్ర.. అందుకే మేం వరుసగా గెలుస్తున్నాం.. టాప్ సీక్రెట్ చెప్పిన గుజరాత్ సారథి

Published : May 01, 2022, 12:41 PM IST
Hardik Pandya: అదే మా సక్సెస్ మంత్ర..  అందుకే మేం వరుసగా గెలుస్తున్నాం.. టాప్ సీక్రెట్ చెప్పిన గుజరాత్ సారథి

సారాంశం

TATA IPL 2022: ఈ సీజన్ లో వరుస విజయాలతో  అందరి అంచనాలను తలకిందులు చేస్తున్నది  హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్. శనివారం  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో కూడా  గుజరాత్ నే విజయం వరించింది. 

ఐపీఎల్-15లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్  వరుస విజయాలతో దూసుకుపోతున్నది. ఇప్పటికే 8 విజయాలతో  ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న  గుజరాత్ టైటాన్స్..  తర్వాత మ్యాచులలో కూడా ఇదే ప్రదర్శన కొనసాగించాలని భావిస్తున్నది. అయితే  తొలుత  ఐపీఎల్ లో గుజరాత్ ఎంట్రీ ఇచ్చినప్పుడు  ఈ జట్టు నాలుగైదు మ్యాచులు గెలిస్తే మహా గొప్ప అన్నవాళ్లు కూడా  నోరెళ్లబెట్టేలా అద్భుత ప్రదర్శనలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న గుజరాత్ టైటాన్స్ విజయరహస్యం ఏమిటి..?  వరుస విజయాల వెనుక ఉన్నదెవరు..?  

గతేడాది దుబాయ్ లో ముగిసిన టీ20 ప్రపంచకప్ లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా గాయం, ఫిట్నెస్ కారణంగా సరిగా ఆడలేక తీవ్ర విమర్శల పాలైన  హార్ధిక్ పాండ్యా.. గుజరాత్ టైటాన్స్ కు సారథిగా నియమించడనగానే  అందరికీ ఆశ్చర్యం. ఫిట్నెస్ కూడా లేని ఇతడితో గుజరాత్ టైటాన్స్ ఏం చేస్తుంది...?  అని అనుమానాలు. 

కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ మొత్తం ఐపీఎల్  చరిత్రలో  ఆడిన తొలి 9 మ్యాచుల్లో 8 విజయాలు సాధించి చరిత్ర సృష్టించింది గుజరాత్. ఆర్సీబీ తో శనివారం  ముగిసిన మ్యాచ్ తర్వాత తన జట్టు సక్సెస్ మంత్ర ఏంటో ఆ జట్టు సారథి హార్ధిక్ పాండ్యా తెలిపాడు.  అది పాండ్యా మాటల్లోనే... ‘ఒక వ్యక్తిగా నేనెప్పుడు ఒక్కడినే ఎదగాలని కోరుకోను. నేను ఎదుగుతూ నాతో పాటు, నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా పైకి రావాలని కోరుకుంటాను. అదే ఫార్ములాను గుజరాత్ టైటాన్స్ లో కూడా పాటిస్తున్నాను.  నాతో పాటే  నా టీమ్ సభ్యులు కూడా పైకి ఎదగాలని ఆశిస్తున్నాను. అదే మా జట్టు సక్సెస్ మంత్ర... 

 

ఈ జట్టుకు నేను కెప్టెన్ ను కావచ్చు. కానీ ఇక్కడ నేను కెప్టెన్, నువ్వు సాధారణ ఆటగాడివన్న భేదం లేదు. అందరూ సమానమే. జట్టులోని 11 మంది  కెప్టెన్లే. అందరం ఒకే దారిలో ఉన్నాం.  ఒక్కరి కోసం అందరం.. అందరి కోసం ఒక్కరం.. ఇప్పటివరకు దీనిని నమ్మే ముందుకు సాగుతున్నాం. ఇకపైనా ఇదే కొనసాగిస్తాం..’ అని చెప్పుకొచ్చాడు. 

ఇంకా హార్ధిక్ మాట్లాడుతూ.. ‘నా జట్టును చూసి నిజంగా గర్వంగా ఉంది. ఇంత మంచి విజయాలు వస్తుండగా ఇంక నేను వాళ్లను ఇలా ఆడు, అలా ఆడు అని  అడగడం ఎందుకు..?’ అని అన్నాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో వచ్చి తన మెరుపులతో మ్యాచులను మలుపు తిప్పుతున్న  రాహుల్ తెవాటియాతో పాటు డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్  లను  పాండ్యా ప్రత్యేకంగా అభినందించాడు. వాళ్లకు అవకాశం దొరికినప్పుడల్లా అదరగొడుతున్నారని కొనియాడాడు.  వాళ్లు భాగా ఆడటమే గాక  జట్టు మొత్తంలో స్ఫూర్తి నింపుతున్నారని  ప్రశంసల వర్షం కురిపించాడు.  

శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్బంగా  తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో  95 కే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో  రాహుల్ తెవాటియా (43 నాటౌట్), డేవిడ్ మిల్లర్ (39 నాటౌట్) లు అద్భుత పోరాటపటిమతో  గుజరాత్ కు వరుసగా ఐదో విజయాన్ని అందించారు. 

PREV
click me!

Recommended Stories

KKR : రూ. 25 కోట్లు పెట్టినా తగ్గేదేలే.. కోల్‌కతా నైట్ రైడర్స్ పక్కా మాస్టర్ ప్లాన్.. !
IPL : ఆర్సీబీ అభిమానులకు పండగే ! 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ టీమ్ ప్లేయర్ !