
ఐపీఎల్-15లో భాగంగా శనివారం రాజస్తాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్ మధ్య ముగిసిన లో స్కోరింగ్ గేమ్ లో రోహిత్ సేన ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో రాజస్తాన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ముంబై సారథిని ఔట్ చేయడం.. అదీ రోహిత్ శర్మ పుట్టినరోజున కావడంతో ఆయన భార్య రితికా సజ్దే తీవ్ర నిరాశకు గురైంది. పక్కనే ఉన్న అశ్విన్ భార్య.. ముందు తన భర్తను అభినందించి తర్వాత రోహిత్ భార్యను ఓదార్చింది. ఈ కుటుంబ కథా చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బయో బబుల్ పుణ్యమా అని చాలా మంది క్రికెటర్ల కుటుంబాలు కూడా ఐపీఎల్ లో ఆటగాళ్లతోనే ఉంటున్నాయి. రెండు నెలల సుదీర్ఘ షెడ్యూల్ కావడంతో తమ భార్య, పిల్లలతో బబుల్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఆటగాళ్లు. వారితో జతగా రావడమే గాక మ్యాచ్ కు వచ్చి తమ భర్తల బౌలింగ్, బ్యాటింగ్ విన్యాసాలను చూసి మురిసిపోతున్నారు.
ఈ జాబితాలో ఇప్పుడు రోహిత్ శర్మ భార్య రితికా, అశ్విన్ భార్య ప్రీతి కూడా చేరారు. రాజస్తాన్-ముంబై మ్యాచ్ కు వీళ్లిద్దరూ కూడా వచ్చారు. అయితే రాజస్తాన్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై కి ఓపెనర్ గా వచ్చిన రోహిత్ ను అశ్విన్ మూడో ఓవర్లోనే ఔట్ చేశాడు. రోహిత్ శర్మ పుట్టినరోజు (ఏప్రిల్ 30) కావడంతో ఈ రోజైనా అతడు ధాటిగా ఆడతాడని, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడతాడని అంతా ఆశించారు. కానీ రోహిత్ మాత్రం 2 పరుగులకే నిష్క్రమించడంతో ప్రేక్షకుల మధ్య గ్యాలరీ లో మ్యాచ్ చూస్తున్న రితికా తీవ్ర నిరాశకు గురైంది. దాదాపు ఏడిచినంత పని చేసింది.
అయితే అవతలి పక్క వికెట్ తీసినందుకు అశ్విన్ ను అభినందించిన అతడి భార్య ప్రీతి.. తర్వాత రితికా దగ్గరికి వెళ్లి ఆమెను ఓదార్చింది. మనసారా హత్తుకోవడంతో రితికా కూడా కళ్లు చెమర్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రితికా, ప్రీతిలే గాక కోహ్లి భార్య అనుష్క శర్మ, చాహల్ భార్య ధనశ్రీ వర్మ, హార్ధిక్ పాండ్యా సతీమణి నటాషా లు కూడా మ్యాచులకు వచ్చి ఆటగాళ్లను ఉత్సాహపరుస్తున్నారు.
ఇక రాజస్తాన్-ముంబై మ్యాచ్ విషయానికొస్తే.. రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ జోస్ బట్లర్ (67) మినహా మిగిలినవారంతా చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. అశ్విన్ (21) ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేసి రాజస్తాన్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై.. 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ (51), తిలక్ వర్మ (35) లు రాణించగా ఆఖర్లో టిమ్ డేవిడ్ (20 నాటౌట్) మెరుపులతో ముంబై కి తొలి విజయం దక్కింది.