ఆ రోజు లక్ష్మణ్ కి బాగా కోపం వచ్చింది.. రైనా

By telugu news teamFirst Published Jun 3, 2020, 7:49 AM IST
Highlights

యూట్యూబ్‌లో ఆకాశ్ చోప్రాతో జరిగిన ఇంటర్వ్యూలో రైనా ఈ విషయాన్ని వెల్లడించాడు. 2010లో మొహాలీలో ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్. అప్పటికి భారత్ స్కోరు 205/9. విజయానికి మరో 11 పరుగులు కావాలనగా చివరి బ్యాట్స్‌మెన్ ప్రగ్యాన్ ఓజా బ్యాటింగ్‌కు వచ్చాడు. 
 
టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కి క్లాసికల్ ప్లేయర్ అనే పేరు ఉంది. ఆయన ఆట తీరుకి లక్షల సంఖ్యలో అభిమానులు ఉండేవారు. ఎన్నో రికార్డులు సాధించిన లక్ష్మణ్ కి కోపం చాలా తక్కువ అనే చెప్పాలి. భారత జట్టుకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ఆటగాళ్లలో లక్ష్మణ్ ఒకడు. ఎన్నో మ్యాచుల్లో భారత్‌ను విజయతీరాలకు చేర్చిన లక్ష్మణ్‌కు బాగా కోపం వచ్చిన ఘటనను సురేష్ రైనా గుర్తుచేసుకున్నాడు. 

యూట్యూబ్‌లో ఆకాశ్ చోప్రాతో జరిగిన ఇంటర్వ్యూలో రైనా ఈ విషయాన్ని వెల్లడించాడు. 2010లో మొహాలీలో ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్. అప్పటికి భారత్ స్కోరు 205/9. విజయానికి మరో 11 పరుగులు కావాలనగా చివరి బ్యాట్స్‌మెన్ ప్రగ్యాన్ ఓజా బ్యాటింగ్‌కు వచ్చాడు. 

ఆ సమయంలో వెన్ను నొప్పితో బాధపడుతున్న లక్ష్మణ్‌కు రన్నర్‌గా రైనా ఉన్నాడు. రన్స్ తీసేప్పుడు లక్ష్మణ్ వికెట్ కోసం డైవ్‌లు చేయడానికి రైనా సిద్ధపడిపోయాడట. ఓవర్ చివరి బంతికి పరుగు తీసి బ్యాటింగ్ లక్ష్మణ్‌కు స్ట్రయికింగ్ ఇవ్వడం ఓజా పని. అయితే ఆ సమయంలో ఓజా రన్ కోసం సరిగా పరిగెత్తడం లేదని లక్ష్మణ్‌కు కోపం వచ్చిందని, ఓజాపై కేకలేశాడని రైనా చెప్పాడు. ‘పరిగెత్తు ఓజా.. పరిగెత్తు అని లక్ష్మణ్ అరుస్తున్నాడు. చివరికి జట్టును ఎప్పటిలాగే విజయతీరాలకు చేర్చాడు’ అని రైనా వెల్లడించాడు.

click me!