టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్... వేగంగా కోలుకుంటున్న రిషబ్ పంత్! సర్జరీ అవసరం లేకుండానే...

By Chinthakindhi RamuFirst Published May 31, 2023, 5:18 PM IST
Highlights

గత ఏడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్... ఐదు నెలల తర్వాత ఊతకర్రల సాయం లేకుండా నడుస్తున్న వీడియో పోస్ట్ చేసిన పంత్.. 

టీమిండియా ఫ్యాన్స్‌కి ఇది నిజంగా శుభవార్తే. డిసెంబర్ 30, 2022న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత యంగ్ సెన్సేషనల్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అనుకున్నదాని కంటే వేగంగా కోలుకుంటున్నాడు. కారు ప్రమాదం తర్వాత వారానికి పైగా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్న రిషబ్ పంత్, మోకాలి చికిత్స తర్వాత నడవడానికి రెండు నెలలకు పైగా సమయం పట్టింది...

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడిన రెండు మ్యాచులకు వచ్చిన రిషబ్ పంత్, మోకాలి గాయంతో నడవడానికి ఇబ్బంది పడుతూ ఊత కర్రల సాయం తీసుకున్నాడు. రిషబ్ పంత్‌కి మరో సర్జరీ అవసరం ఉండవచ్చని వైద్యులు భావించారు.

అయితే మే 30న నిర్వహించిన వైద్య పరీక్షల్లో రిషబ్ పంత్‌కి రెండో సర్జరీ అవసరం లేదని, గాయం సహజసిద్ధంగా కోలుకుంటోందని వైద్యులు ప్రకటించారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rishabh Pant (@rishabpant)

‘రిషబ్ పంత్‌కి కారు ప్రమాదంలో చాలా చోట్ల గాయాలైనట్టు వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదు. మోకాలికి ఇంకో సారి శస్త్ర చికిత్స నిర్వహించాలా? వద్దా? అనే విషయంలో డాక్టర్లు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే రిషబ్ పంత్ కోలుకుంటున్న తీరుపై వాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. అనుకున్నదాని కంటే వేగంగా రిషబ్ పంత్ కోలుకుంటున్నాడని తెలిపారు...

అన్నీ కరెక్టుగా జరిగితే త్వరలోనే రిషబ్ పంత్ రీఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు అతను ఊతకర్రల సాయం లేకుండానే నడవగలుగుతున్నాడు. అయితే పూర్తి ట్రైయినింగ్ మొదలెట్టడానికి కాస్త సమయం పడుతుంది...’ అంటూ ఓ బీసీసీఐ అధికారి, మీడియాకి తెలియచేశాడు..


రిషబ్ పంత్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు. ఊత కర్ర సాయం లేకుండా నడుస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రిషబ్ పంత్, ‘హ్యాపీ నో మోర్ క్రచెస్ డే’ అంటూ కాప్షన్ జోడించాడు...

గాయం కారణంగా ఐదు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్నాడు రిషబ్ పంత్. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు ఐపీఎల్ 2023 సీజన్‌కి దూరమైన రిషబ్ పంత్, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కూడా ఆడడం లేదు...

ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో కూడా రిషబ్ పంత్ ఆడడం అనుమానమే. అయితే రిషబ్ పంత్ వేగంగా కోలుకుని రీఎంట్రీ ఇస్తే మాత్రం వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియాకి అదనపు ఎనర్జీ దొరికినట్టు అవుతుంది...

రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడి టీమ్‌కి దూరం కావడంతో వన్డేల్లో కెఎల్ రాహుల్‌ని తిరిగి వికెట్ కీపర్‌గా ఆడిస్తోంది టీమిండియా. అతను కూడా ప్రస్తుతం గాయంతో జట్టుకి దూరమయ్యాడు. ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా వన్డేల్లో డబుల్ సెంచరీ బాదినా... మిడిల్ ఆర్డర్‌లో పెద్దగా రాణించలేకపోతున్నాడు...

శుబ్‌మన్ గిల్‌తో రోహిత్ శర్మ ఓపెనర్‌గా సెటిల్ కావడంతో ఇషాన్ కిషన్‌ని ఓపెనర్‌గా ఆడించలేని పరిస్థితి. టీ20ల్లో పెద్దగా రాణించకపోయినా టెస్టులు, వన్డేల్లో టీమిండియాకి కీ ప్లేయర్‌గా మారిన రిషబ్ పంత్... అనుకోకుండా కారు ప్రమాదంలో గాయపడడం.. టీమ్‌ని తీవ్రంగా ప్రభావితం చేసింది..

ఐదు నెలలుగా క్రికెట్‌‌కి దూరంగా ఉన్నా టీమిండియా తరుపున ఐసీసీ ప్లేయర్ల ర్యాంకింగ్స్‌లో టెస్టుల్లో టాప్ 10లో ఉన్న ఏకైక బ్యాటర్ రిషబ్ పంతే. 

click me!