అన్ని ఫార్మాట్లకూ రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. ఇక కొత్త అవతారంలో చూస్తారంటూ హింట్!

By Srinivas MFirst Published May 30, 2023, 9:16 PM IST
Highlights

Ambati Rayudu Retirement: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన  అంబటి రాయుడు   ఇండియన్  ప్రీమియర్ లీగ్ తో పాటు  అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలిగాడు.  

ఆంధ్రా ఆటగాడు, భారత క్రికెట్ జట్టు  వెటరన్ క్రికెటర్ అంబటి రాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవలే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. తాజాగా  భారత జాతీయ జట్టుతో పాటు క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకూ  రిటైర్మెంట్  ప్రకటించాడు. ఈ మేరకు రాయుడు తన సోషల్ మీడియా ఖాతాలలో  ఓ ప్రకటన ద్వారా  రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించాడు.   అండర్- 15 స్థాయి నుంచి భారత  సీనియర్ జట్టు వరకూ  ప్రాతినిథ్యం వహించిన ఈ ఆంధ్రా క్రికెటర్.. ఇక తనను మరో రూపంలో చూస్తారని రాజకీయ ఎంట్రీకి  కూడా హింట్ ఇచ్చాడు. 

ఐపీఎల్-16 ఫైనల్ ముగిసిన తర్వాత  రాయుడు  నేడు సాయంత్రం 5 గంటలకు  తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ట్విటర్ లో  ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేస్తూ.. తనను అవకాశాలు కల్పించిన టీమ్స్, సహకారాలు అందించిన  వ్యక్తులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపాడు. 

రాయుడు తన ట్విటర్ ఖాతాలో..  ‘ఈరాత్రి నాకు  ఎంతో  భావోద్వేగపూరితమైనది. ఐపీఎల్ లో ప్రత్యేకమైన విజయం దక్కింది. ఈ సందర్భంలో నేను  భారత క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా.   నేను టెన్నిస్ బాల్ తో  క్రికెట్ ఆడుతున్న  సమంలో  మూడు దశాబ్దాల పాటు నా ప్రయాణం సాగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు.. 

 

pic.twitter.com/rwUaptbvSr

— ATR (@RayuduAmbati)

అండర్ -15 స్థాయి నుంచి నా దేశానికి  ప్రాతినిథ్యం వహించడం  నేను గౌరవంగా భావిస్తున్నా.  2013లో టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చినప్పుడు క్యాప్ అందుకున్న క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి.  ఈ  సందర్భంగా నేను బీసీసీఐ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ),  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ),  విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ), బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ)   లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే నా ఐపీఎల్ టీమ్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు.  నా ఐపీఎల్ కెరీర్ ను ఆరు టైటిల్స్ విజేతగా ముగిస్తుండటం గర్వంగా ఉంది...
 
2013లో ముంబై ఇండియన్స్ తరఫున ఫస్ట్ ట్రోఫీ నెగ్గినప్పటి క్షణాల నుంచ సీఎస్కే తరఫున 2018, 2021, 2023 లలో  చెన్నై తరఫున  ట్రోఫీలు నెగ్గడం మరిచిపోలేనిది.  కెప్టెన్ ధోని భాయ్‌తో  నా ప్రయాణం  చేయడం గౌరవంగా భావిస్తున్నా. గడిచిన రెండు దశాబ్దాలుగా  ఆన్ ది ఫీల్డ్, ఆఫ్ ది ఫీల్డ్ లో మా మధ్య మంచి అనుబంధముంది.  అది నా మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటుంది.  నా ప్రయాణంలో ఇవన్నీ జరగడానికి ముఖ్య కారణం నా కుటుంబం, ప్రత్యేకించి మా నాన్న సాంబశివరావు.  నా తోటి ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, అభిమానులు, కోచ్‌‌లు.. ఇలా అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఇక నుంచి నన్ను మరో కోణంలో చూస్తారు..’అని   లేఖలో రాసుకొచ్చాడు. 

 

Ambati Rayudu with IPL 2023 Trophy.

He has won 3 IPL with Mumbai & 3 IPL with Chennai. pic.twitter.com/lxuBe2Wvi6

— Johns. (@CricCrazyJohns)

అండర్ -15, అండర్ -19 స్థాయిలలో అదరగొట్టి  2013లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రాయుడు టీమిండియా తరఫున 55 వన్డేలు, ఆరు టీ20లు ఆడాడు.  వన్డేలలో 47.06 సగటుతో 1,694 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు పది హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. టీమిండియా తరఫున రాయుడు ఆరు టీ20లు ఆడి  42 పరుగులు సాధించాడు. 

ఐపీఎల్‌లో 204 మ్యాచ్ లు ఆడిన రాయుడు.. 4,348 పరుగులు చేశాడు.  ఇందులో ఒక సెంచరీ, 22  అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. క్రికెట్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో రాయుడు..  ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలున్నట్టు  గుసగుసలు వినిపిస్తున్నాయి. 

click me!