
నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మరోసారి అలాంటి వ్యాఖ్యలతోనే వార్తల్లో నిలిచాడు. ఎప్పుడూ కోహ్లీని ఏదో ఒకరకంగా విమర్శించే గంభీర్ ఇప్పుడు కోహ్లీ ఫ్రెండ్, ఐపీఎల్ లో అతడితో కలిసి చాలాకాలంపాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడిన ఏబీ డివిలియర్స్ మీద పడ్డాడు. అభిమానులు మిస్టర్ 360గా పిలుచుకునే డివిలియర్స్ కు వ్యక్తిగత రికార్డులు తప్ప ఐపీఎల్ లో గొప్పగా చేసిందేమీ లేదని వ్యాఖ్యానించాడు.
స్టార్ స్పోర్ట్స్ తో జరిగిన ఓ చర్చలో సౌతాఫ్రికా దిగ్గజం డివిలియర్స్ గురించి అడగగా గంభీర్ స్పందిస్తూ... ‘ఏబీ డివిలియర్స్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వంటి చిన్న గ్రౌండ్ లో 8-10 ఏండ్లు ఆడాడు. అతడే కాదు చిన్నస్వామి వంటి చిన్న స్టేడియంలో ఆడితే ఎవరికైనా అదే స్ట్రైక్ రేట్, యావరేజ్ ఉంటుంది...
ఇండియా బ్యాటర్ సురేశ్ రైనాకు నాలుగు ఐపీఎల్ టైటిల్స్ ఉన్నాయి. డివిలియర్స్ కు వ్యక్తిగత రికార్డులు మాత్రమే ఉన్నాయి..’అని వ్యాఖ్యానించాడు. గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆర్సీబీ ఫ్యాన్స్ కు సహజంగానే ఆగ్రహం తెప్పించగా డివిలియర్స్ ను అభిమానించే వాళ్లు కూడా గంభీర్ పై మండిపడుతున్నారు.
డివిలియర్స్ మీద కామెంట్స్ చేస్తున్న గంభీర్ ద కు చిన్న స్వామి స్టేడియంలో గొప్ప రికార్డులేమీ లేవని.. అలా అయితే అతడిని తక్కువ చేసి చూడాలా..? అని లెక్కలతో సహా వివరాలు చూపుతూ గంభీర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘చిన్నస్వామి స్టేడియంలో గంభీర్ ఐపీఎల్ లో 11 ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో అతడి సగటు 30.2. స్ట్రైక్ రేట్ 126.4గా ఉంది. అదే డివిలియర్స్ 61 ఇన్నింగ్స్ లలో సగటు 43.56గా ఉండగా స్ట్రైక్ రేట్ 161.2గా ఉంది. ఇంత చిన్న స్టేడియంలో గంభీర్ పరుగులు చేయలేకపోవడం నాకు వింతగా తోస్తోంది..’అని కామెంట్ చేశాడు.
మరో నెటిజన్..‘గంభీర్ ను ఆటగాడిగా నేను చాలా ఆరాధిస్తా. భారత జట్టు తరఫున ఆడుతూ అతడు చేసిన ప్రదర్శనలపై నాకు గౌరవం ఉంది. కానీ ఐపీఎల్ దిగ్గజంగా ఉన్న డివిలియర్స్ పై ఇలా వ్యాఖ్యానించడం తగదు..’అని రాసుకొచ్చాడు.
ఈ సఫారీ దిగ్గజం ఐపీఎల్ లో 184 మ్యాచ్ లు ఆడి 39.7 సగటు 151.7 స్ట్రైక్ రేట్ తో 5,162 పరుగులు చేశాడు. గంభీర్.. 154 మ్యాచ్ లలో 31.23 సగటు, 123.88 సగటుతో 4,217 రన్స్ మాత్రమే చేశాడు. కానీ కేకేఆర్ కు సారథిగా వ్యవహరించిన సమయంలో గంభీర్.. రెండు ఐపీఎల్ ట్రోఫీలను సాధించాడు. ఆర్సీబీ ఇంతవరకూ ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా నెగ్గలేదు.