కెకెఆర్‌ కెప్టెన్‌గా తనను షారుఖ్ ఖాన్ తీసేయడానికి కారణం చెప్పిన దాదా

By Sreeharsha GopaganiFirst Published Jul 10, 2020, 2:24 PM IST
Highlights

  2008, 2009, 2010 సీజన్లకు కెకెఆర్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన గంగూలీని 2011 సీజన్‌కు ముందు షారుఖ్‌ ఖాన్‌ ప్రాంఛైజీ కెకెఆర్ వదులుకుంది. 

పశ్చిమ బెంగాల్‌ ప్రిన్స్‌, ఈడెన్‌ గార్డెన్స్‌ ఆల్‌టైమ్‌ హీరో సౌరవ్‌ గంగూలీ ఐపీఎల్‌ ప్రాంఛైజీ కోల్‌కత నైట్‌రైడర్స్‌గా ఐకాన్‌ క్రికెటర్‌గా వెళ్లాడు. 2008, 2009, 2010 సీజన్లకు కెకెఆర్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2011 సీజన్‌కు ముందు గంగూలీని షారుఖ్‌ ఖాన్‌ ప్రాంఛైజీ వదులుకుంది. 

పుణె వారియర్స్‌ తరఫున కోల్‌కతకు వచ్చిన ప్రత్యర్థి జట్టు నాయకుడు సౌరవ్‌ గంగూలీకి ఈడెన్‌ గార్డెన్స్‌ బ్రహ్మరథం పట్టింది. కోల్‌కత నైట్‌రైడర్స్‌ యాజమాన్యంతో విభేదాలపై గంగూలీ ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌లో మాట్లాడుతూ.. ఆనాటి రహస్యాలను గంగూలీ బయటపెట్టాడు. 

'నేను గౌతం గంభీర్‌ది ఓ ఇంటర్వ్యూ చూశాను. అందులో.. ఇది నీ జట్టు. నేను జోక్యం చేసుకోను అని షారుక్‌ ఖాన్‌ చెప్పినట్టు గంభీర్‌ అన్నాడు. నిజానికి తొలి సీజన్‌లో నేను అడిగింది అదే. జట్టును నాకు వదిలేయమని చెప్పాను. కానీ అది జరుగలేదు. 

ఐపీఎల్‌లో అత్యత్తమ జట్లుగా నిలిచిన ప్రాంఛైజీలు జట్టును పూర్తిగా ఆటగాళ్లకు వదిలేశాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌లో ధోని, ముంబయి ఇండియన్స్‌లో రోహిత్‌ శర్మలకు తుది జట్టు ఎంపికలో సదరు ఆటగాడు ఉండాలని ఎవరూ చెప్పరు. 

నైట్‌రైడర్స్‌లో ఆలోచన విధానమే అసలు సమస్య. కోచ్‌ జాన్‌ బుకానన్‌ జట్టుకు నలుగురు కెప్టెన్లు ఉండాలని భావించాడు. సమస్య నాలో లేదు, వ్యవస్థలో ఉంది. ఒకే కెప్టెన్‌ ఉండాలనే వ్యవస్థ నాది. బ్రెండన్‌ మెక్‌కలమ్‌, మరో ఆటగాడు, బౌలింగ్‌ విభాగానికో కెప్టెన్‌.. ఇలా అందరూ కెప్టెనే అయితే అసలు నాయకుడు ఏం చేయాలో నాకు తెలియదు' అని గంగూలీ పేర్కొన్నాడు. ఐపీఎల్‌ తొలి సీజన్‌లో కోల్‌కతకు ఆడిన ఆకాశ్‌ చోప్రా సైతం కోచ్‌ జాన్‌ బుకానన్‌ కెప్టెన్‌ గంగూలీని తప్పించాలని చూశాడని ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే.

గంగూలీ తన ఆత్మకథ ' ఏ సెంచరీ ఈజ్‌ నాట్‌ ఎనాఫ్‌'లో కోల్‌కత నైట్‌రైడర్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ' కెకెఆర్‌ కెప్టెన్‌గా షారుక్‌ ఖాన్‌తో నిరంతరం టచ్‌లోనే ఉన్నాను. తుది జట్టును ఖరారు చేసేందుకు మూడో సీజన్‌లో ఒకటిరెండు సార్లు షారుక్‌ అభిప్రాయం తీసుకున్నాను. 

భారత జట్టు కెప్టెన్‌గా ఈ పని నేను ఎన్నడూ చేయలేదు. కెప్టెన్‌గా నిర్ణయాలు నాకు వదిలేయటం న్యాయమని నేను భావించాను. అందుకు, జట్టు నుంచి బ్యాట్స్‌మన్‌గా నన్ను తప్పించట అన్యాయంగా భావించాను. నాకు గురించి షారుక్‌ను చెడుగా ఎవరైనా చెప్పారా? అనే ఆలోచన సైతం ఎన్నోసార్లు వచ్చింది. 

ప్రతిసారీ సమాధానం అలా జరిగి ఉండకపోవచ్చు అనే. కానీ ఈడెన్‌ గార్డెన్స్‌లో డక్కన్‌ ఛార్జర్స్‌ హైదరాబాద్‌తో ఓ మ్యాచ్‌ అనంతరం కెకెఆర్‌ మేనేజ్‌మెంట్‌ నాపై కోపం పెంచుకుందని నాకు అనిపిస్తుంది' అని గంగూలీ పుస్తకంలో రాసుకున్నారు.

click me!