
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ మరో వివాదానికి కేంద్ర బింధువయ్యాడు. ఇప్పటికే విరాట్ కోహ్లి-బీసీసీఐ విబేధాలతో భారత క్రికెట్ జట్టు, బోర్డు ప్రతిష్ట మంటగలవగా తాజాగా గంగూలీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. దాదా.. నిబంధనలకు విరుద్ధంగా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సమావేశాలకు హాజరవుతున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషమై బోర్డు రెండు వర్గాలుగా చీలినట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే కోహ్లి అభిమానులు గంగూలీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. చేసింది చాలు ఇక దిగిపోతే బెటర్ అని శాపనార్థాలు పెడుతున్నారు. కోహ్లితో విబేధాలు ముగియకముందే దాదా పై వచ్చిన ఈ ఆరోపణలు భారత క్రికెట్ ను మరింత కుదిపేస్తున్నాయని టీమిండియా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలే కోహ్లి తో విబేధాలతో తలమునకలై ఉన్న గంగూలీ.. సెలెక్షన్ కమిటీ సమావేశాలకు కూడా హాజరవుతున్నాడని సోషల్ మీడియా వేదికగా ఓ ప్రముఖ క్రీడా జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేశాడు. అలా చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అతడు రావడం ఆశ్చర్యకరంగా ఉందని, భవిష్యత్ లో ఇలాంటివి మళ్లీ రిపీట్ కాబోవని ఆశిస్తున్నాని తన ట్వీట్ లో పేర్కొన్నాడు.
ప్రముఖ క్రీడా జర్నలిస్టు కెఎస్ఆర్ తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘సెలెక్షన్ కమిటీ సమావేశాలకు హాజరవుతూ ఓ బీసీసీఐ వ్యక్తి అక్కడి అంశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాడు. వీటన్నింటికీ దూరంగా ఉండాలని ఆయనకు తెలుసు. కానీ ఆయన మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కెప్టెన్, కోచ్ లది ఏమీ చేయలని పరిస్థితి. అసలు ఆయకు అక్కడేం పని..? భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కావని అనుకుంటున్నాను...’ అని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ ఇప్పుడు భారత క్రికెట్ లో హాట్ టాపిక్ అయింది. కెఎస్ఆర్ తన ట్వీట్ లో ఎక్కడా గంగూలీ పేరు ప్రస్తావించకపోయినా.. ఆయన పేర్కొన్న ‘బీసీసీఐ వ్యక్తి’ గంగూలీయేనని కోహ్లి ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. భారత క్రికెట్ ను భ్రష్టు పట్టించడానికే గంగూలీ ఇలా చేస్తున్నారంటూ ఆయనపై మండిపడుతున్నారు. కోహ్లి విషయంలో ఇలాగే తలదూర్చి అతడిని సారథిగా తొలగించిన గంగూలీ.. ఇప్పుడు సెలెక్షన్ కమిటీ సమావేశాలకు హాజరవుతూ నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడని వాపోతున్నారు. గంగూలీ గద్దె దిగే సమయం ఆసన్నమైందంటూ సోషల్ మీడియా లో గంగూలీకి వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతున్నారు.
అర్థం లేని ఆరోపణలు..! కాదు నిజమే..!!
ఇదిలాఉండగా.. బీసీసీఐలో ఇద్దరు ప్రతినిధులు దీనిపై భిన్నంగా స్పందించారు. గంగూలీ పై వచ్చిన ఆరోపణలపై బీసీసీఐకి చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘అవన్నీ పూర్తిగా అర్థంలేని ఆరోపణలు.. అది అబద్దం..’ అని తెలిపాడు. మరో వ్యక్తి మాట్లాడుతూ... ‘అతడు (గంగూలీ) తనకు అవసరం లేని విషయాల్లో తలదూర్చుతున్నాడు. బీసీసీఐ ఇప్పుడు ఇలాగే నడుస్తున్నది. సెలెక్షన్ కమిటీ మీటింగులకు హాజరయ్యే అధికారం గంగూలీకి లేదు. ఇది దురదృష్టకరం..’ అని వ్యాఖ్యానించాడు.
బీసీసీఐ రాజ్యాంగం ఏం చెబుతున్నది..?
బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. బోర్డు అధ్యక్షుడు సెలెక్షన్ కమిటీ సమావేశాల్లో జోక్యం చేసుకునేందుకు వీల్లేదు. కానీ బీసీసీఐ సెక్రెటరీకి మాత్రం ఆ అవకాశముంది. జట్టును ఎంపిక చేసే తుది నిర్ణయం మాత్రం సెలెక్టర్లదే. సెలెక్షన్ కమిటీ.. కెప్టెన్, కోచ్ లతో మాట్లాడి జట్టును ఎంపిక చేస్తుంది.