2007 నుంచి వార్మప్ మ్యాచ్‌లలో మనోళ్ల ప్రదర్శన ఎలా ఉంది..?

By Srinivas M  |  First Published Oct 17, 2022, 11:50 AM IST

T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో ఈనెల 23న భారత జట్టు  పాకిస్తాన్ తో తలపడనుంది. అంతకంటే  ముందు మన జట్టు  రెండు  వార్మప్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.  మరి 2007 నుంచి వార్మప్ మ్యాచ్ లలో భారత ప్రదర్శన ఎలా ఉంది..? 
 


ద్వైపాక్షిక సిరీస్ ల కోసం విదేశాలకు వెళ్లే జట్లు.. అక్కడ పరిస్థితులకు అలవాటుపడటానికి గాను నిర్వాహకులు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఏర్పాటుచేస్తారు. అలాంటిది  ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల ముందు వార్మప్ మ్యాచ్ లు కూడా  ఆ స్థాయిలోనే అలరిస్తాయి. తాజాగా భారత జట్టు.. ఆస్ట్రేలియాలో ప్రపంచకప్ ఆడటానికంటే ముందు రెండు వార్మప్ మ్యాచ్ లు ఆడుతుంది. అందులో ఒకటి నేడు  గబ్బా వేదికగా జరుగుతున్నది.  మరి  2007 నుంచి ఇప్పటివరకు భారత జట్టు వార్మప్ మ్యాచ్ లలో ఎటువంటి ప్రదర్శనలు చేసిందో ఇక్కడ చూద్దాం. 

2007లో ప్రారంభమైన టీ20 ప్రపంచకప్ తొలి ఎడిషన్ లో భారత జట్టు ఒక్క వార్మప్ మ్యాచ్ కూడా ఆడలేదు. 2007 సెప్టెంబర్ 11న ఈ టోర్నీ మొదలవగా.. సెప్టెంబర్ 8న భారత జట్టు ఇంగ్లాండ్ లో  వన్డే సిరీస్ లో భాగంగా చివరి వన్డే ఆడింది. అక్కడ్నుంచి నేరుగా వచ్చి  ఈ మెగా టోర్నీలో పాల్గొంది. 

Latest Videos

2009లో భారత జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడింది.  పాకిస్తాన్, న్యూజిలాండ్ తో ఆడి ఒకదాంట్లో గెలిచి మరోదాంట్లో ఓడింది. కివీస్ తో మ్యాచ్ లో ఓడి పాకిస్తాన్ పై గెలిచింది. 

2010 లో  ఈ మెగా టోర్నీ ఏప్రిల్ 30 న ప్రారంభమైంది. కానీ  భారత జట్టుకు చెందిన పలువురు ఆటగాళ్లు ఏప్రిల్ 25న ఐపీఎల్ ముగించుకుని వెళ్లేసరికి అప్పటికే సమయం మించిపోయింది. దీంతో ఈ ఎడిషన్ లో భారత్ వార్మప్ మ్యాచ్ లు లేకుండానే బరిలోకి దిగింది. 

2012లో భారత్.. శ్రీలంక, పాకిస్తాన్ తో   ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడింది. శ్రీలంక  తో 26 పరుగుల తేడాతో గెలవగా పాకిస్తాన్ తో  లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 

2014లో టీమిండియా.. ఇంగ్లాండ్, శ్రీలంకతో ప్రాక్టీస్ మ్యాచ్ లను ఆడింది. ఇంగ్లాండ్  పై 20 పరుగుల తేడాతో గెలవగా శ్రీలంకతో పోరులో  5 పరుగుల తేడాతో ఓడింది. ఫైనల్లో కూడా భారత్ - శ్రీలంకలు తలపడగా లంకకే ట్రోఫీ దక్కింది. 

 

Australia have won the toss and elect to bowl first.

Follow the match here - https://t.co/3dEaIjz140 pic.twitter.com/Js9ETposyf

— BCCI (@BCCI)

2016 ఎడిషన్ కు ఇండియా ఆథిత్యమిచ్చింది. వెస్టిండీస్, సౌతాఫ్రికాతో ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడింది.   విండీస్ ఈడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్ లో 45 పరగుుల తేడాతో గెలిచింది. ముంబైలో సౌతాఫ్రికాతో  ఉత్కంఠ పోరులో 4 పరుగుల తేడాతో ఓడింది.  

దుబాయ్ వేదికగా ముగిసిన 2021 ఎడిషన్ లో భారత్ ఆస్ట్రేలియా,  ఇంగ్లాండ్ తో ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడింది. రెండింటికి రెండు ఘన విజయాలు అందుకుంది.  కానీ  అసలు టోర్నీకి వచ్చేసరికి మాత్రం చతికిలపడింది. 

ఇక 2022 ప్రపంచకప్ లో తాజాగా ఆస్ట్రేలియా తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ లో భారత జట్టు  తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేసింది.  ఆసీస్ ముందు 187 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. ఫలితంగా ఆసీస్ కూడా ధీటుగా బదులిస్తున్నది. 

click me!