బౌలింగ్ చేసేప్పుడు నేను అలా ఎందుకు చూస్తానంటే..: సీక్రేట్ రివీల్ చేసిన ముత్తయ్య మురళీధరన్

By Srinivas MFirst Published Jan 28, 2022, 1:11 PM IST
Highlights

Muttiah Muralitharan:  శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య  మురళీధరన్ క్రికెట్ ఆడిన రోజుల్లో బ్యాటర్ కు బంతిని విసిరేప్పుడు.. ఆయన చూసే చూపే భయం గొల్పేలా ఉంటుంది. సదరు బ్యాటర్.. బంతిని అంచనా వేయడం అటుంచితే.. ఆ చూపు నుంచి తప్పించుకుంటే చాలురా దేవుడా అన్నంత భయంగా ఉంటాయి ఆయన కండ్లు..

శ్రీలంక  దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు దశాబ్దాల పాటు  ప్రపంచ క్రికెట్ లో అగ్రస్థాయి స్పిన్నర్ గా ఉన్న మురళీధరన్  సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా టెస్టులలో అయితే మురళీధరన్ రికార్డు.. ఇప్పట్లో బద్దలయ్యే అవకాశమే లేదు.  ఇప్పుడున్న ప్రపంచ అగ్ర స్థాయి బౌలర్లలో ఎవరు కూడా ఆయన దరిదాపుల్లో కూడా లేరు. కాగా.. మురళీధరన్ క్రికెట్ ఆడిన రోజుల్లో బ్యాటర్ కు బంతిని విసిరేప్పుడు.. ఆయన చూసే చూపే భయం గొల్పేలా ఉంటుంది.  సదరు బ్యాటర్.. బంతిని అంచనా వేయడం అటుంచితే.. మురళీధరన్ చూపుకే సగం భయపడిపోతారు. క్రికెటర్లే కాదు.. టీవీల ముందు  మ్యాచులు చూసే అభిమానులు కూడా  మురళీ బౌలింగ్ యాక్షన్ కు భయపడేవారంటే అతిశయోక్తి కాదు. 

అయితే  ఆ బౌలింగ్ యాక్షన్ వెనుక గల సీక్రెట్ ను మురళీధరన్ రివీల్ చేశాడు. బ్యాటర్ కు బాల్ వేసేప్పుడు  తాను ఎందుకు అలా చూస్తానో వెల్లడించాడు. దుబాయ్ లో  లెజెండ్స్  లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) సందర్భంగా.. అతడు ఈ  గుట్టు విప్పాడు. దీనితో పాటు పలు ఇతర అంశాలపై కూడా మురళీ స్పందించాడు. 

 

మురళీధరన్ స్పందిస్తూ... ‘ఏకాగ్రత, బౌలింగ్ వేయడానికి ముందు నేను చేసిన కృషి.. నేను మీ (బ్యాటర్) వద్దకు వస్తున్నానని తెలియజెప్పడం.. ఆ సమయంలో నా ముఖంలో సహజంగానే ఆ ప్రతిచర్య (కోపంగా చూడటం) కనిపించేది..’ అని అన్నాడు.  ఇందుకు సంబంధించిన వీడియోను ఎల్ఎల్సీ నిర్వాహకులు యూట్యూబ్ వేదికగా పంచుకున్నారు. 

సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లలో ఎవరికి బౌలింగ్ చేయడం సులువు అని ప్రశ్నించగా..  మురళీధరన్ స్పందిస్తూ.. ‘సచిన్ టెండూల్కర్’ అని బదులిచ్చాడు. మురళీధరన్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే వరకు భారత్-శ్రీలంక మ్యాచ్ ఎప్పుడు జరిగినా సచిన్-మురళీల మధ్య పోరు ఆసక్తికరంగా  ఉండేది. మురళీధరన్ తన కెరీర్ లో సచిన్ ను 13 సార్లు ఔట్ చేశాడు.  ఆ తర్వాత ఆస్ట్రేలియా పేసర్ బ్రెట్ లీ.. సచిన్ ను 14 సార్లు ఔట్ చేశాడు. 

ఇక ప్రస్తుత బౌలర్లలో ఎవరంటే మీకు ఇష్టమని  మురళీని అడగగా..  అతడు స్పందిస్తూ.. ‘రవిచంద్రన్ అశ్విన్’ అని బదులిచ్చాడు.  గతంలో కూడా మురళీధరన్.. తనకు అశ్విన్ బౌలింగ్ అంటే ఇష్టమని,  భవిష్యత్తులో  ఎవరైనా తన రికార్డులను బద్దలుకొట్టాల్సి వస్తే అది అశ్విన్ కావాలని కోరుకుంటున్నానని చెప్పిన  సంగతి తెలిసిందే. 

ఇవేగాక.. షేన్ వార్న్, తన మధ్య  ఎవరు గొప్ప..? ఆండ్రూ ఫ్లింటాఫ్ కు తనకు మధ్య సాగిన ఫన్నీ ఫైట్స్.. ఇతర విషయాల పై మురళీ స్పందించాడు. ఈ లెజెండ్ మాట్లాడిన వీడియోను మీరూ చూసేయండి మరి.. శ్రీలంక తరఫున 1992 నుంచి 2011 దాకా ఆడిన మురళీధరన్.. 133 టెస్టులలో 800 వికెట్లు, 350 వన్డేలలో 534 వికెట్లు పడగొట్టాడు. టెస్టులలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా మురళీధరన్ రికార్డును బద్దలు కొట్టే మొనగాడు ఇప్పట్లో రాలేడు.. అంటే అది అతిశయెక్తి ఏమాత్రం కాదు. 

click me!