ఇండియా మహారాజాస్‌కి మరో ఓటమి... ఫైనల్‌కి ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్...

By Chinthakindhi RamuFirst Published Jan 28, 2022, 10:05 AM IST
Highlights

లెజెండ్స్ లీగ్ క్రికెట్‌ టోర్నీలో వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఓడిన ఇండియా మహారాజాస్... ఫైనల్‌కి వరల్డ్ జెయింట్స్, ఆసియా లయన్స్ జట్లు...

లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 టోర్నీలో ఇండియా మహారాజాస్ జట్టు వరుసగా మూడో ఓటమితో ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. ఫైనల్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ల వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో పోరాడి ఓడింది ఇండియా మహారాజాస్...

వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా మహారాజాస్ జట్టు, ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. కేవిన్ పీటర్సన్ 5 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేయగా ఫిల్ ముస్టర్డ్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేయగా హర్షల్ గిబ్స్ 46 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు...

కేవిన్ ఓబ్రియెన్ 14 బంతుల్లో 5 సిక్సర్లతో 34 పరుగులు చేయగా జాంటీ రోడ్స్ 13 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేశాడు. అల్బీ మోర్కెల్ 9 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన వరల్డ్ జెయింట్స్ జట్టు 228 పరుగులు చేసింది...

ఇండియా మహారాజాస్ బౌలర్లలో మునాఫ్ పటేల్ రెండు, స్టువర్ట్ బిన్నీ, రజత్ భాటియా, ఇర్ఫాన్ పఠాన్ తలా ఓ వికెట్ తీశారు. 229 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఇండియా మహారాజాస్ జట్టు వసీం జాఫర్ 6 బంతుల్లో 4, బద్రీనాథ్ 4 బంతుల్లో 2 పరుగులు వికెట్లను త్వరగా కోల్పోయింది...

ఈ దశలో యూసఫ్ పఠాన్, నమన్ ఓజా కలిసి మూడో వికెట్‌కి 103 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 45 పరుగులు చేసిన యూసఫ్ పఠాన్ అవుటైన తర్వాత స్టువర్ట్ బిన్నీ 4 బంతుల్లో 3 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 

ఇర్ఫాన్ పఠాన్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు చేయగా ఓపెనర్ నమన్ ఓజా 51 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 95 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రజత్ భటియా 8 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేశాడు. నాలుగు మ్యాచుల్లో ఒకే ఒక్క విజయాన్ని అందుకున్న ఇండియా మహారాజాస్ జట్టు ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది...

ఇండియా మహారాజాస్ జట్టు కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ టోర్నీలో పాల్గొనకపోగా, మొదటి మూడు మ్యాచులకు కెప్టెన్సీ చేసిన మహ్మద్ కైఫ్ కూడా ఈ మ్యాచ్‌లో బరిలో దిగలేదు. దీంతో వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌కి యూసఫ్ పఠాన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. వరల్డ్ జెయింట్స్ జట్టు నాలుగింట్లో మూడు విజయాలు అందుకోగా ఆసియా లయన్స్ జట్టు నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు, రెండు పరాజయాలు అందుకుంది...

ఆసియా లయన్స్‌పై భారీ విజయంతో లెజెండ్స్ లీగ్ క్రికెట్‌ను మొదలెట్టిన ఇండియా మహారాజాస్, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో ఓడింది. వరల్డ్ జెయింట్స్, ఆసియా లయన్స్ మధ్య జనవరి 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 

click me!