ICC U-19 World Cup: ఆఫ్ఘాన్ సంచలన విజయం.. అండర్-19 ప్రపంచకప్ సెమీస్ కు.. కీలక పోరులో రనౌట్ అయిన శ్రీలంక..

Published : Jan 28, 2022, 12:13 PM IST
ICC U-19 World Cup: ఆఫ్ఘాన్ సంచలన విజయం.. అండర్-19 ప్రపంచకప్ సెమీస్ కు.. కీలక పోరులో రనౌట్ అయిన శ్రీలంక..

సారాంశం

ICC Under-19 World Cup 2022:  వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ లో ఆఫ్ఘానిస్థాన్ సంచలన విజయాన్ని అందుకుంది.  తక్కువ పరుగులే నమోదైన ఈ మ్యాచులో శ్రీలంకను రనౌట్ చేసి సెమీస్ కు చేరింది.   

ఆఫ్ఘానిస్థాన్ యువ క్రికెట్ జట్టు సంచలనం సృష్టించింది. తక్కువ స్కోర్లు నమోదైన అండర్-19 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ లో శ్రీలంకను చిత్తు చేసింది. తద్వారా  ఈ టోర్నీలో సెమీస్ కు చేరిన తొలి ఆసియా జట్టుగా ఘనత సాధించింది.   తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘాన్ జట్టు.. 134 పరుగులే చేసినా.. వాటిని కూడా కాపాడుకుంది. స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు తడబడింది.  విజయానికి నాలుగు పరుగుల దూరంలో ఆ జట్టు  ఆలౌట్ అయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.  ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు  సెమీస్ చేరిన విషయం తెలిసిందే.  ఫిబ్రవరి 1న ఇంగ్లాండ్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య  సెమీఫైనల్ జరుగనుంది. 

గురువారం రాత్రి అంటిగ్వాలోని కూలిడ్జ్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన  క్వార్లర్స్ లో శ్రీలంక టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. అయితే లంక బౌలర్ల ధాటికి అఫ్ఘాన్ బ్యాటర్లు  క్రీజులో నిలదొక్కుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. అబ్దుల్ హది (37) ఒక్కడే టాప్ స్కోరర్.  10.6 ఓవర్లలో మొదలైన ఆ జట్టు వికెట్ల పతనం..  క్రమం తప్పకుండా కొనసాగింది. క్రీజులోకి వచ్చిన అఫ్ఘాన్ బ్యాటర్లు.. ఆడుతున్నది  వన్డేనా..? టెస్టు మ్యాచా...? అన్నట్టుగా ఆడారు.  

 

అప్ఘాన్ ఇన్నింగ్సులో అత్యధిక స్కోరు చేసిన హది కూడా.. 37 పరుగులు చేయడానికి 97 బంతులు తీసుకున్నాడు.  ఆ జట్టులో నలుగురు బ్యాటర్లు  మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. అల్లా నూర్ (25),  నూర్ అహ్మద్ (30), ఖారోట్ (13) మినహా.. మిగిలిన ఆటగాళ్లంతా అలా వచ్చి ఇలా వెళ్లారు. దీంతో  అఫ్ఘాన్.. 47.1 ఓవర్లలో 134 పరుగుల చేసింది. శ్రీలంక బౌలర్లలో వినుజా రాన్పాల్ ఐదు వికెట్లు (9.1-3-10-5) తీశాడు. కెప్టెన్ వెల్లలగె కూడా మూడు వికెట్లు పడగొట్టాడు. 

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో  చేజింగ్ ప్రారంభించిన లంకకు ఆదిలోనే తొలి దెబ్బ తగిలింది.  ఆ జట్టు ఓపెనర్ సదిశ రాజపక్స (0) తొలి బంతికే  డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన  వరుసగా ఐదుగురు బ్యాటర్లు కూడా రెండంకెల స్కోరు చేయలేదు.  ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన వెల్లలగె (34) నిలదొక్కుకున్నాడు. అతడు లోయరార్డర్  బ్యాటర్లతో కలిసి లంక ను గెలిపించే ప్రయత్నం చేశాడు. రవీన్ డి  సిల్వ (21), రాన్పాల్ (11) లు విజయం కోసం ప్రయత్నించారు.

కానీ  అఫ్ఘాన్ బౌలర్లు, ఫీల్డర్లు అద్భుతంగా పోరాడారు.  లంక జట్టులో నలుగురు బ్యాటర్లు  రనౌట్లయ్యారు. ఆఫ్ఘాన్ బౌలర్లు వికెట్లు తీయడమేగాక లంక పై పొదుపుగా బంతులు వేసి వారిపై ఒత్తిడి పెంచారు. చివరికి ట్రావిన్ మాథ్యూ (4) ను రనౌట్ చేయడంతో అఫ్ఘాన్ ఆటగాళ్ల  సంబురాలు చేసుకున్నారు.  ఇక ఆఫ్ఘాన్ బౌలర్లంతా సమిష్టిగా రాణించారు.  బిలాల్ సమి కి రెండు వికెట్లు దక్కగా.. నవీద్ జద్రన్, నూర్ అహ్మద్, నవీద్, ఖారోట్ లు తలో వికెట్ దక్కించుకున్నారు.  బ్యాటింగ్ లో 30 పరుగులు చేసి  బౌలింగ్ లో ఓ వికెట్ తీసి, ఓ రనౌట్ కూడా చేసిన   అప్ఘాన్  ఆటగాడు నూర్ అహ్మద్ కు  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

సంక్షిప్త స్కోరు : ఆఫ్ఘానిస్థాన్ 47.1 ఓవర్లలో 134 ఆలౌట్ 

శ్రీలంక :  46 ఓవర్లలో 130 ఆలౌట్ 

PREV
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?