
త్వరలో దోహా వేదికగా జరుగబోయే మూడు టీ20 మ్యాచ్ ల అఫ్గానిస్తాన్ సిరీస్ కోసం ఏకంగా ఐదుగురు ఆటగాళ్లను పక్కనబెట్టడంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి బాబర్ ఆజమ్ తో పాటు వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్, స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్ లను పక్కనబెట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. తాజాగా ఇదే విషయమై పాకిస్తాన్ మాజీ సారథి రషీద్ లతీఫ్ సంచలన కామెంట్స్ చేశాడు. #Rest in Peace Pakistan Cricet Team అంటూ వ్యాఖ్యానించి దుమారం రేపాడు.
ఇదే విషయమై లతీఫ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘కొన్నాళ్లుగా మన ఆటగాళ్లు ఐసీసీ ర్యాకింగ్స్ లో అదరగొడుతున్నారు. బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది లు గతేడాది ఐసీసీ అవార్డులు కూడా గెలిచారు. ఇది పీసీబీకి నచ్చలేదు...
అందుకే బోర్డుకు ఉన్న అధికారాలను అడ్డుపెట్టుకుని తమకు నచ్చినవారిపై వేటు వేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫామ్ లో ఉన్న, విశ్రాంతి అవసరం లేని ఆటగాళ్లకు రెస్ట్ ఇస్తున్నారు. కానీ 70, 80 ఏండ్ల వయసులో ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకోవాల్సిన వాళ్లు మాత్రం బోర్డులో రాజ్యమేలుతున్నారు. అంతేగాక వీళ్లు పాక్ క్రికెట్ లో సమూల మార్పులు తేవాలనుకుంటున్నారు. అందుకే పాకిస్తాన్ క్రికెట్ ప్రస్తుతం రెస్ట్ ఇన్ పీస్ (రిప్) మోడ్ లో ఉందని నేను చెప్పగలను.
జట్టులోకి కొత్త ప్లేయర్లకు అవకాశమివ్వడం మంచిదే. దానిని ఎవరూ కాదనరు. కానీ ఆ సాకుతో మొత్తం జట్టునే ప్రక్షాళన చేయడం మంచిది కాదు. కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లతను అఫ్గాన్ తో సిరీస్ ఆడనివ్వండి. కానీ సీనియర్ల మార్గదర్శకత్వంలో ఆడితే వారికీ మంచిది. అలా కాకుండా సీనియర్ల కాంబినేషన్ ను చెడగొట్టి మొత్తానికి మొత్తంగా యువ ఆటగాళ్లతో జట్టును తయారుచేస్తాననడం మూర్ఖత్వమే. ఈ విషయంలో మీడియా కూడా బోర్డు మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరముంది.. లేకుంటే పాకిస్తాన్ క్రికెట్ నాశనానికి ఇదే తొలి అడుగుగా కనిపిస్తోంది..’ అని ఆగ్రహం వ్యక్తం చేశఆడు.
కాగా అఫ్గనిస్తాన్ సిరీస్ లో ఐదుగురు సీనియర్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చిన పాకిస్తాన్.. కెప్టెన్ తో పాటు హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్ నూ మార్చింది. ఇది తాత్కాలికమేనని పీసీబీ చెబుతున్నా.. వచ్చే ఏడాది యూఎస్ఎ, కరేబియన్ దీవులలో నిర్వహించబోయే టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకునే పీసీబీ ఈ నిర్ణయం తీసుకుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.