మళ్లీ కెలికిన అఫ్రిది: బేవకూఫ్‌ అంటూ గంభీర్‌పై వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 27, 2019, 11:42 AM IST
Highlights

గత కొంతకాలంగా ఉప్పు-నిప్పులా ఉంటున్న టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిల మధ్య ఇంకా మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది.

గత కొంతకాలంగా ఉప్పు-నిప్పులా ఉంటున్న టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిల మధ్య ఇంకా మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. పుల్వామా ఘటనలో 42 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో గంభీర్ తీవ్రంగా స్పందించాడు.

పాక్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, ప్రపంచకప్‌లో కూడా ఆ జట్టుతో జరిగే మ్యాచ్‌ను భారత్ బహిష్కరించాలని డిమాండ్ చేశాడు. మహా అయితే టీమిండియా రెండు పాయింట్లు కోల్పోతుందని, ఆట కన్నా దేశ ప్రజల మనోభావాలే ముఖ్యమని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

అతని ప్రతిపాదన పట్ట అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. కొందరు దీనికి అనుకూలంగా, మరికొందరు భిన్నంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చివరికి బీసీసీఐ కూడా పాక్‌తో మ్యాచ్ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేయడంతో ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు ఇక కష్టమేనని అనిపించింది.

తాజాగా మరోసారి ఇదే విషయంపై స్పందించిన అఫ్రిది.. ప్రపంచకప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌ను బహిష్కరించాలన్న గంభీర్ వ్యాఖ్యలు అర్థరహితమన్నాడు. ఇవి గౌతమ్ లాంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా..? అని ప్రశ్నించాడు. ప్రజలకు ఇలాగానే చెప్పేది అని నిలదీశాడు.

గంభీర్ ఒక బేవకూఫ్ అంటూ అఫ్రిది ఘాటుగా విమర్శించాడు. ఇతన్ని ఇటీవల ఎన్నికల్లో ఎన్నుకున్న ప్రజలనుద్దేశించి కూడా అఫ్రిది పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. పుల్వామా ఉగ్రదాడి ఆమోదయోగ్యం కాదని, కానీ దానికి ముడిపెడుతూ మ్యాచ్‌ను బహిష్కరించాలని చెప్పడం ఏంటని అఫ్రిదీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇప్పటికే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదని, ఇకపై ఆసియాకప్‌లోనూ రెండు జట్లు తలపడకపోవడం మంచిదని షాహిద్ అభిప్రాయపడ్డాడు. కొద్దిరోజుల ముందు తన ఆత్మకథ ‘‘గేమ్ చేంజర్’’‌లో గంభీర్‌ను ఉద్దేశిస్తూ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు.

గంభీర్‌కు పొగరు తప్ప చెప్పుకోదగ్గ రికార్డులేమీ లేవని ఆ బుక్‌లో పేర్కొన్నాడు. తన మత విశ్వాసాల కారణంగా తన కూతుళ్లను ఔట్ డోర్ గేమ్స్ ఆడనివ్వనని అఫ్రిదీ పేర్కొన్నాడు. 

click me!