కరోనా దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారిపై పోరులో భారతదేశం సైతం ఇదే బాటలో పయనిస్తూ లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగించింది కూడా.
ఇక ఇలా లాక్ డౌన్ ను పొడిగించిన వేళ ప్రజలందరినీ ఇంటిపట్టునే ఉంటూ ప్రభుత్వానికి సహకరించాలని సెలెబ్రిటీలు పిలుపునిస్తున్నారు. తాజాగా టీం ఇండియా కోచ్ రవి శాస్త్రి కూడా ప్రజలకు ఈ కరోనా పై పోరులో భాగంగా ఇంట్లోనే ఉంటూ ప్రభుత్వ సూచనలను పాటించాలని, అధికారులకు సహకరించాలని పిలుపునిచ్చారు.
ఇక ఈ కరోనాపై పోరును ఆయన అన్ని ప్రపంచ కప్లకు అమ్మ అని చెప్పుకొచ్చారు. మామూలుగా క్రికెట్ వరల్డ్ కప్ ని 11 మంది ఆటగాళ్లు కలిసి ఆడితే... ఈ కరోనా వరల్డ్ కప్ ని భారతీయులంతా కలిసి ఆడుతున్నారని ఆయన అభివర్ణించారు.
Stay Home, Stay Safe! 🙏 pic.twitter.com/JQTZVib2in
— Ravi Shastri (@RaviShastriOfc)
ఈ కరోనా మహమ్మారిపైయుద్ధంలో అందరం కలిసి పోరాడాలని దానిపై విజయం తథ్యంగా సాధించవచ్చని ఆయన అన్నారు. ఇకపోతే భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
భారతదేశంలో కరోనా వైరస్ కారణంగా 414 మంది మరణించారు. గత 24 గంటల్లో కొత్తగా 37 మరణాలు సంభవించాయి. కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 12,380కి చేరుకుంది.
కేంద్ర ప్రభుత్వం బుధవారంనాడు దేశంలోని 170 జిల్లాలను హాట్ స్పాట్స్ గా ప్రకటించింది. ఇందులో ఆరు మెట్రో నగరాలు ఉన్నాయి. 123 జిల్లాల్లో పెద్ద యెత్తున కరోనా వైరస్ వ్యాపించినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
ముంబై, కోల్ కతా, బెంగళూరు అర్బన్ 9 జిల్లాలు, హైదరాబాదు, చెన్నై, జైపూర్, ఆగ్రాలు హాట్ స్పాట్స్ గా గుర్తించినవాటిలో ఉన్నాయి. హాట్ స్పాట్లలో ఈ నెల 20వ తేదీ తర్వాత కూడా ఆంక్షలు కొనసాగుతాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21 లక్షలకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 1.34 లక్షల మంది మరణించారు. 5.09 మంది కరోనా నుంచి కోలుకున్నారు.