రవిశాస్త్రిని వెతికి వెతికి స్విమ్మింగ్ పూల్‌లో తోసేశాం.. అది బెస్ట్ టూర్: మియాందాద్

By Siva KodatiFirst Published Apr 15, 2020, 9:23 PM IST
Highlights
 పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్.. టీమిండియా హెడ్ కోచ్‌ రవిశాస్త్రిని ఆటపట్టించిన ఘటనను గుర్తుచేసుకున్నాడు.
ఇరు దేశాల మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ భారత్-పాక్ క్రికెటర్లు మాత్రం పరస్పరం స్నేహంగానే మెలుగుతారు. మొన్నామధ్య పాక్ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్.. టీమిండియా హెడ్ కోచ్‌ రవిశాస్త్రిని ఆటపట్టించిన ఘటనను గుర్తుచేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఓసారి పాక్ క్రికెట్ జట్టు భారత పర్యటనకు వచ్చింది.

బెంగళూరులో టెస్ట్ సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లు ఒకే హోటల్‌లో ఉన్నారు. సాయంత్రం పూటా రెండు జట్ల క్రికెటర్లు సరదాగా గడిపేవారు. అది హోలీ టైం కావడంతో హోటల్‌లో ఉన్న వారంతా హోలీ ఆడేవారు.

ఈ సందర్భంగా ఇమ్రాన్‌ఖాన్ రూంలోకి వెళ్లి తామంతా రంగులు చల్లుకున్నామని.. భారత క్రికెటర్లను వదల్లేదని.. వారు కూడా తమకు ఎలాంటి అడ్డు చెప్పలేదని మియాందాద్ గుర్తుచేసుకున్నాడు.

అలాగే ఇప్పటి టీమిండియా హెడ్  కోచ్ రవిశాస్త్రి ఓ రూంలో దాక్కొన్న విషయాన్ని గుర్తించి.. వెంటనే అతనిని మోసుకెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో తోసేశామని చెప్పాడు. నాటి పర్యటనను బాగా ఎంజాయ్ చేశామన్న ఆయన.. పాక్ క్రికెటర్లందరికీ అది ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరూ ఇతర మతాల పండగల్లోనూ పాలు పంచుకోవాలని.. దీనిలో భాగంగానే తాము హోలీ పండుగను జరుపుకున్నామని మియాందాద్ చెప్పాడు. ఒకరి పండుగల్లో మరొకరు పాల్గొనడంలో ఎలాంటి తప్పూ లేదని ఓ యూట్యూబ్‌ వీడియోలో తన అభిప్రాయం చెప్పాడు.  
click me!