
క్రికెట్ లో ఫార్మాట్ ఏదైనా బ్యాటింగ్ చేసే జట్టుకు భాగస్వామ్యం ఎంతో ముఖ్యం. ఇద్దరు బ్యాటర్లు కుదురుకున్నారంటే.. వాళ్లు ఏ స్థాయిలో ఆడతారో నాటి ఈడెన్ గార్డెన్ (ఇండియా-ఆస్ట్రేలియా టెస్టు) మ్యాచ్ నుంచి నేటి ఎడ్జబాస్టన్ (ఇండియా - ఇంగ్లాండ్) టెస్టు వరకు టీమిండియా ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఈడెన్ గార్డెన్ లో ఓటమి అంచున ఉన్న భారత్ ను వీవీఎస్ లక్ష్మణ్-రాహుల్ ద్రావిడ్ లు ఎలా గట్టెక్కించారో చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖితమై ఉంది. తాజాగా ఎడ్జబాస్టన్ లో కూడా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో రిషభ్ పంత్-రవీంద్ర జడేజాలు అద్భుత భాగస్వామ్యం నెలకొల్పి భారత్ ను ఆదుకున్నారు.
అయితే ఈ టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో కూడా భారత్ 75 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన పంత్ మరోసారి ఆపద్బాంధవుడి పాత్రను పోషించాడు. పుజారా తో కలిసి ఇప్పటికే నాలుగో వికెట్ కు 50 పరుగులు జోడించాడు. తాజాగా ఈ జోడీని టీమిండియా ఫ్యాన్స్ 2000వ దశకంలో డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్-ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ లతో పోలుస్తున్నారు.
దూకుడుగా ఆడటంలో సెహ్వాగ్ కు ప్రత్యేక శైలి ఉంది. ప్రపంచంలో ఎంతటి బౌలర్ అయినా వీరూ కు తెలిసొందొక్కటే.. బాదడం. కానీ ద్రావిడ్ విషయానికొస్తే అతడు వీరూ కు పూర్తిగా విరుద్ధం. నెమ్మదిగా ఓ గోడను కడుతున్నట్టు.. గులాబి మొక్కు అంటు కడుతున్నంత అందంగా ఉంటుంది అతడి ఆట.
ఇప్పుడు పంత్-పూజారాలు కూడా అంతే. పంత్ టెస్టులను కూడా టీ20ల మాదిరిగా ఆడుతున్నాడు. పంత్ మాత్రం సాంప్రదాయక టెస్టు ఆటనే ఇంకా కొనసాగిస్తున్నాడు. ఎడ్జబాస్టన్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో కూడా తొలి ఇన్నింగ్స్ మాదిరే భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోతున్న వేళ పుజారాకు జతకలిసిన పంత్.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడటమే గాక భారత్ కు భారీ ఆధిక్యం అందించే దిశగా సాగుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా ఫ్యాన్స్.. పంత్-పుజారా జోడీని సెహ్వాగ్-ద్రావిడ్ లతో పోలుస్తున్నారు. ట్విటర్ వేదికగా ఇందుకు సంబంధించిన పోస్టులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
పంత్-పుజారాలు కీలక ఇన్నింగ్స్ లు ఆడటం ఇదే ప్రథమం కాదు. ఈ ఇద్దరూ గత ఆస్ట్రేలియా సిరీస్ లో సిడ్నీ టెస్టులో 148 పరుగులు, గబ్బా టెస్టులో 61 పరుగులు జోడించి భారత్ ను ఆదుకున్నారు. తాజాగా ఎడ్జబాస్టన్ టెస్టులో కూడా ఇదే జోడీ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తున్నది. ఇప్పటికే ఈ టెస్టులో భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో 257 పరుగుల ఆధిక్యంలో ఉంది.