పావెల్ పరాక్రమం.. బంగ్లాదేశ్ కు తప్పని ఓటమి..

Published : Jul 04, 2022, 11:36 AM IST
పావెల్ పరాక్రమం.. బంగ్లాదేశ్ కు తప్పని ఓటమి..

సారాంశం

WI vs BAN T20: విండీస్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ కు కరేబియన్ జట్టు చుక్కలు చూపుతున్నది. టెస్టు సిరీస్ ను కోల్పోయిన బంగ్లా పులులు.. టీ20 లలో కూడా విఫలమవుతున్నారు. 

స్వదేశంలో బంగ్లాదేశ్ పై జరుగుతున్న సిరీస్ లో వెస్టిండీస్  వరుస విజయాలతో దూసుకుపోతున్నది. ఇప్పటికే టెస్టు సిరీస్ ను 2-0తో నెగ్గిన కరేబియన్ జట్టు.. టీ20 సిరీస్ లో కూడా అదరగొడుతున్నది. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా డొమినికా వేదికగా జరిగిన రెండో  మ్యాచ్ లో వెస్టిండీస్.. 35 పరుగుల తేడాతో బంగ్లాను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 రన్స్ చేయగా.. ఆ తర్వాత బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులే చేసింది. విండీస్ స్టార్ బ్యాటర్, ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రొవ్మన్ పావెల్ (28 బంతుల్లో 61 నాటౌట్.. 2 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ జట్టులో ఓపెనర్ బ్రాండన్ కింగ్ (43 బంతుల్లో 57.. 7 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ నికోలస్ పూరన్ (30 బంతుల్లో 34.. 3 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు.  వీరి దూకుడుతో  విండీస్ 12 ఓవర్లకే 100 పరుగులు సాధించింది. 

ఇక ఆ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన పావెల్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బంగ్లా బౌలర్ల బౌలింగ్ ను ఊచకోత కోస్తూ.. సిక్సర్లతో హోరెత్తించాడు. పావెల్ బాదడంతో విండీస్ భారీ స్కోరు సాధించింది.  

 

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్.. 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఓపెనర్లు అనముల్ హక్ (3), లిటన్ దాస్ (5) తో పాటు కెప్టెన్ మహ్మదుల్లా (11) కూడా  దారుణంగా విఫలమయ్యారు. అయితే షకిబ్ అల్ హసన్ (52 బంతుల్లో 68 నాటౌట్.. 5 ఫోర్లు, 3 సిక్సర్లు) గెలిపించడానికి విశ్వప్రయత్నం చేశాడు. అతడికి తోడుగా అఫిఫ్ హుస్సేన్ (34) కాసేపు మెరుపులు మెరిపించాడు. కానీ కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో బంగ్లా విజయ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 

ఈ సిరీస్ లో ఇప్పటికే తొలి టీ20 వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్ లో విండీస్ గెలిచింది. చివరి మ్యాచ్ లో  విండీస్ గెలిస్తే టీ20 సిరీస్ కూడా సొంతమవుతుంది. టీ20ల తర్వాత విండీస్.. బంగ్లాతో మూడు వన్డేలు కూడా ఆడాల్సి ఉంది. 


 

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !