హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టినా, ఒక్క పరుగు తేడాతో ఓడిన వెస్టిండీస్... ఇంగ్లాండ్‌తో టీ20 మ్యాచ్‌లో...

By Chinthakindhi RamuFirst Published Jan 24, 2022, 9:53 AM IST
Highlights

ENG vs WI 2nd T20I: 172 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగి 170 పరుగులకి పరిమితమైన వెస్టిండీస్... ఆఖరి ఓవర్‌లో అకీల్ హుస్సేన్ మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదినా దక్కని విజయం...

వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టీ20, పొట్టి ఫార్మాట్‌లోని నిజమైన కిక్‌ని మరోసారి పరిచయం చేసింది. తొలి టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ వన్‌ సైడ్ విజయం సాధించగా... ఆఖరి బంతి దాకా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందుకుని ఊపిరి పీల్చుకుంది ఇంగ్లాండ్...

టాస్ గెలిచి, ఇంగ్లాండ్‌కి బ్యాటింగ్ అప్పగించింది వెస్టిండీస్. టామ్ బంటన్ 18 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు, జాసన్ రాయ్ 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేయగా మొయిన్ ఆలీ 24 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేశారు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 12 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేయగా క్రిస్ జోర్డాన్ 15 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేశాడు... దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది ఇంగ్లాండ్...

172 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన వెస్టిండీస్‌కి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ బ్రెండన్ కింగ్ గోల్డెన్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ షై హోప్ 9 బంతుల్లో 2 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది విండీస్. నికోలస్ పూరన్ 22 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేయగా, డారెన్ బ్రావో 20 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్‌తో 23 పరుగులు చేశాడు...

కిరన్ పోలార్డ్ 4 బంతుల్లో 1, జాసన్ హోల్డర్ 6 బంతుల్లో 1 పరుగు, ఓడెన్ స్మిత్ 3 బంతుల్లో 7 పరుగులు, ఫాబియన్ ఆలెన్ 11 బంతుల్లో 12 పరుగులు చేసి అవుట్ కావడంతో 15.1 ఓవర్లలోనే 98 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి, విజయంపై ఆశలు కోల్పోయింది వెస్టిండీస్...

అయితే రొమరియో షెఫార్డ్, అకీల్ హుస్సేన్ కలిసి అద్భుతంగా పోరాడు. 18వ ఓవర్‌లో మూడు సిక్సర్లు బాది 23 పరుగులు రాబట్టిన ఈ ఇద్దరూ, ఆ తర్వాత 19వ ఓవర్‌లో 8 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో ఆఖరి ఓవర్‌లో విండీస్ విజయానికి 30 పరుగులు కావాల్సి వచ్చింది. తొలి బంతి వైడ్‌గా వెళ్లగా, ఆ తర్వాతి బంతికి పరుగులేమీ రాలేదు. 5 బంతుల్లో 30 పరుగులు కావాల్సిన దశలో వరుసగా రెండు బంతుల్లో 2 ఫోర్లు బాదాడు అకీల్ హుస్సేన్...

ఆ తర్వాత వైడ్ రూపంలో ఓ అదనపు వచ్చింది. ఆ తర్వాత వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సర్లు రాబట్టాడు అకీల్ హుస్సేన్. అయితే చివరి ఓవర్‌లో 28 పరుగులు మాత్రమే రావడంతో ఒకే ఒక్క పరుగు తేడాతో మ్యాచ్‌ను ఓడిపోయింది వెస్టిండీస్... 

రొమరియో షెఫార్డ్ 28 బంతుల్లో ఓ ఫోర్, 5 సిక్సర్లతో 44 పరుగులు చేయగా, అకీల్ హుస్సేన్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఈ ఇద్దరూ 9వ వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

ఒక్క పరుగు తేడాతో టీ20 మ్యాచులు ఓడిపోవడం వెస్టిండీస్‌కి ఇది మూడోసారి. ఈ విషయంలో వెస్టిండీస్‌ టాప్‌లో ఉంది. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించడంతో పాటు 3 వికెట్లు తీసి వెస్టిండీస్ ఓటమికి కారణమైన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది..

click me!