వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన సౌతాఫ్రికా.. దీపక్ చాహార్ మెరిసినా, పోరాడి ఓడిన టీమిండియా...

By Chinthakindhi RamuFirst Published Jan 23, 2022, 10:27 PM IST
Highlights

49.2 ఓవర్లలో 283 పరుగులకు టీమిండియా ఆలౌట్... దీపిక్ చాహార్ మెరుపు హాఫ్ సెంచరీ వృథా... మూడు వన్డేల్లో గెలిచి, టీమిండియాని వైట్‌వాష్ చేసిన సౌతాఫ్రికా... 

సౌతాఫ్రికా టూర్‌ను విజయంతో ఆరంభించిన టీమిండియా, మరో విజయం లేకుండానే వరుసగా ఐదు పరాజయాలతో టూర్‌ని ముగించింది... మూడో వన్డేలో 288 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన భారత జట్టు, 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 49.2 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌట్ కావడంతో సౌతాఫ్రికాకి 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం దక్కింది.. కెప్టెన్‌గా మొదటి నాలుగు మ్యాచుల్లోనూ ఓడిపోయాడు కెఎల్ రాహుల్... 

10 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, లుంగి ఎంగిడి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు... 18 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో సీనియర్లు శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్‌కి 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆదుకునే ప్రయత్నం చేశారు. 

73 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 61 పరుగులు చేసిన శిఖర్ ధావన్, ఫెలూక్వాయో బౌలింగ్‌లో డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...


116 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న రిషబ్ పంత్, గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఫెలూక్వాయో బౌలింగ్‌లో మగలకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు రిషబ్ పంత్. 118 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది టీమిండియా...

లక్ష్యఛేదనలో అత్యధిక 50+ స్కోర్లు చేసిన ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకున్నాడు విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 69+ వన్డేల్లో లక్ష్యఛేదనలో 50+ స్కోర్లు చేయగా, విరాట్‌కి ఇది 61వ 50+ ఛేజింగ్ స్కోరు...

వన్డేల్లో విరాట్‌కి ఇది 64వ అర్ధశతకం... హాఫ్ సెంచరీ తర్వాత బ్యాటుని బేబీలా ఊపుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ...  84 బంతుల్లో 5 ఫోర్లతో 65 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో భవుమాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ 34 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేసి అవుట్ కాగా సూర్యకుమార్ యాదవ్ 32 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేశారు...

జయంత్ యాదవ్ 6 బంతుల్లో 2 పరుగులు చేసి అవుట్ కావడంతో 223 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో దీపక్ చాహార్ వస్తూనే ఎదురుదాడికి దిగాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసి, చేయాల్సిన రన్‌రేట్‌ను అమాంతం తగ్గించేశాడు...
 
31 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న దీపక్ చాహార్, సౌతాఫ్రికాలో సౌతాఫ్రికాపై వన్డేల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.. లుంగి ఎంగిడి బౌలింగ్‌లో దీపక్ చాహార్ అవుటయ్యే సమయానికి భారత జట్టు విజయానికి 17 బంతుల్లో 10 పరుగులు మాత్రమే కావాలి. అయితే 15 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన బుమ్రా, ఆ తర్వాతి ఓవర్‌లోనే భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత 2 పరుగులు చేసిన చాహాల్‌‌ను ప్రిటోరియస్ అవుట్ చేయడంతో 283 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్‌కి తెరపడింది...

click me!