టీ20 వరల్డ్ కప్ 2022 విజేత ఇంగ్లాండ్.. ఫైనల్‌లో పాకిస్తాన్‌పై ఘన విజయం...

By Chinthakindhi Ramu  |  First Published Nov 13, 2022, 5:07 PM IST

T20 World cup 2022 ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం... 2010 తర్వాత రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్... రెండోసారి ఫైనల్‌లో ఓడిన పాకిస్తాన్.. 


టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీని ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. లో స్కోరింగ్ గేమ్‌లో పాక్ విధించిన 138 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించిన ఇంగ్లాండ్, రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ని సొంతం చేసుకుంది. మూడోసారి ఫైనల్ చేరిన పాకిస్తాన్, మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆసియా కప్ 2022 టోర్నీ ఫైనల్‌లో ఓడిన పాక్, టీ20 వరల్డ్ కప్‌లో లక్కీగా ఫైనల్ చేరినా టైటిల్ మత్రం గెలవలేకపోయింది.. 

138 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌కి తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. అలెక్స్ హేల్స్ 1 పరుగు చేయగా ఫిలిప్ సాల్ట్ 9 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేశాడు. 17 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన జోస్ బట్లర్ కూడా హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

Latest Videos

undefined

45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. ఈ దశలో బెన్ స్టోక్స్, హారీ బ్రూక్ కలిసి నాలుగో వికెట్‌కి 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 23 బంతుల్లో ఓ ఫోర్‌తో 20 పరుగులు చేసిన హారీ బ్రూక్, షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

10 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది ఇంగ్లాండ్. అయితే షాదబ్ ఖాన్ వేసిన 11వ ఓవర్‌లో 2 పరుగులు మాత్రమే రాగా నసీం షా వేసిన 12వ ఓవర్‌లో 3 పరుగులే వచ్చాయి. ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో 5 పరుగులు రాగా, 14వ ఓవర్‌లో 2 పరుగులే ఇచ్చాడు నసీం షా...

దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. పరుగులు రావడం కష్టంగా మారడంతో పాకిస్తాన్ గెలుస్తుందేమోనని అనిపించింది. అయితే 15వ ఓవర్ ఆఖరి బంతికి ఫోర్ బాదిన బెన్ స్టోక్స్, 16వ ఓవర్ ఆఖరి 2 బంతుల్లో 4, 6 బాది 13 పరుగులు రాబట్టాడు...

మహ్మద్ వసీం జూనియర్ వేసిన 17వ ఓవర్‌లో మూడు ఫోర్లు బాదిన మొయిన్ ఆలీ 16 పరుగులు రాబట్టాడు. దీంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు వచ్చేసింది. చివరి 3 ఓవర్లలో ఇంగ్లాండ్ విజయానికి 12 పరుగులు మాత్రమే కావాల్సి వచ్చాయి. 13 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, మహ్మద్ వసీం బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ సమయానికి ఇంగ్లాండ్ విజయానికి 11 బంతుల్లో 6 పరుగులే కావాలి.. 

47 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బెన్ స్టోక్స్, మహ్మద్ వసీం బౌలింగ్‌లో బౌండరీ బాది స్కోర్లను సమం చేశాడు. ఆ తర్వాతి రెండో బంతికి సింగిల్ తీసి ఇంగ్లాండ్‌కి వరల్డ్ కప్ అందించాడు..

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ తొలి బంతినే నో బాల్‌గా వేశాడు బెన్ స్టోక్స్. ఈ ఓవర్‌లో రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మహ్మద్ రిజ్వాన్, ఆ అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు...

14 బంతుల్లో ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్, సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన మహ్మద్ హారీస్, అదిల్ రషీద్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 28 బంతుల్లో 2 ఫోర్లతో 32 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, అదిల్ రషీద్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...


ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో బాబర్ ఆజమ్ వికెట్ తీసిన అదిల్ రషీద్, వికెట్ మెయిడిన్ వేశాడు. 6 బంతులాడినా పరుగులేమీ చేయలేకపోయిన ఇఫ్తికర్ అహ్మద్, బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. 28 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేసిన షాన్ మసూద్, సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో లియామ్‌స్టోన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

14 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు చేసిన షాదబ్ ఖాన్, క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో అవుట్ కాగా అదే ఓవర్‌లో మహ్మద్ వసీం జూనియర్ ఇచ్చిన క్యాచ్‌ని హ్యారీ బ్రూక్ జారవిడిచాడు. 7 బంతుల్లో 5 పరుగులు చేసిన మహ్మద్ నవాబ్ కూడా సామ్ కుర్రాన్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు...

మహ్మద్ వసీం జూనియర్ 4 పరుగులు చేసి అవుట్ కాగా, షాహీర్ ఆఫ్రిదీ 5 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పాక్ ఇన్నింగ్స్‌లో ఆఖరి 5 ఓవర్లలో 2 ఫోర్లు మాత్రమే రాగా 31 పరుగులు మాత్రమే వచ్చాయి. 4 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చిన సామ్ కుర్రాన్, 3 వికెట్లు పడగొట్టాడు. 

click me!