ind vs Eng: ఆటగాళ్లకు నెగిటివ్.. మాంచెస్టర్ టెస్ట్ కి లైన్ క్లియర్..!

By telugu news teamFirst Published Sep 10, 2021, 11:31 AM IST
Highlights


ఐదో టెస్ట్ జరగడంపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా సందేహం వ్యక్తం చేయడంతో అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి

ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో.. ఐదో టెస్టుకి రంగం సిద్ధమౌతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు జరగగా..  రెండు విజయం సాధించి.. ఇండియా అగ్రస్థానంలో ఉంది. కాగా.. చివరిది మాంచెస్టర్ వేదికగా జరగాల్సి ఉంది. కాగా.. ఈ సిరీస్ లో చివరి మ్యాచ్ కూడా గెలిచి చారిత్రాత్మక విజయం సాధించేందుకు కోహ్లీ సేన కసరత్తులు చేస్తోంది. అయితే.. ఈ సమయంలో కరోనా కలవరం రేపడంతో.. ఐదో టెస్టు జరగదేమో అనే సందేహాలు తలెత్తాయి.

 ఆటగాళ్లకు అత్యంత సన్నిహితంగా ఉన్న జూనియర్‌ ఫిజియో యోగేశ్‌ పర్మార్‌కు కోవిడ్ పాజిటివ్‌ రావడంతో అంతా అయోమయంలో పడ్డారు. బుధవారం సాయంత్రం వరకు ఆటగాళ్లతోనే కలిసి పని చేయడంతో కేసులు మరిన్ని పేరిగే అవకాశం ఉందని సమాచారం. ఫిజియోకి కరోనా సోకడంతో ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు చేసుకున్న భారత ఆటగాళ్లు హోటల్‌ గదులకే పరిమితమయ్యారు.

ఐదో టెస్ట్ జరగడంపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా సందేహం వ్యక్తం చేయడంతో అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. ‘‘ప్రస్తుత స్థితిలో ఐదో టెస్టు ప్రారంభం అవుతుందో లేదో తెలియదు. కానీ, మ్యాచ్‌ మొదలవుతుందనే ఆశిస్తున్నా’’ అని గంగూలీ అన్నాడు.

అయితే, భారత ఆటగాళ్లకు చేసిన కోవిడ్ టెస్టులో అంతా నెగిటివ్‌గా తేలడంతో చివరి టెస్ట్ సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం (సెప్టెంబర్ 9) జరిగిన RT-PCR టెస్టుల్లో తాజా రౌండ్‌లో భారత ఆటగాళ్లందరూ నెగిటివ్‌గా తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, ఆటగాళ్లకు నెగెటివ్‌గా వచ్చినప్పటికీ, టెస్ట్ మ్యాచ్ అవకాశాలపై ఇప్పటివరకు ఇరు బోర్డుల నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్ నుంచి నేరుగా ఐపీఎల్‌కు బయలుదేరబోతున్న జట్టు సభ్యులతోపాటు బృందంలోని పాజిటివ్ కేసులపై భారత బోర్డ్ భయాందోళనలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. అయితే భారత ఫిజియోలు – పర్మార్, నితిన్ పటేల్ ఇద్దరి సేవలు లేకుండానే భారత్ బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. లండన్‌లో నాలుగో టెస్ట్ ముగిసిన తరువాత హెడ్ కోచ్ రవిశాస్త్రి పాజిటివ్‌గా తేలడంతో ప్రస్తుతం టీం నుంచి దూరంగానే ఉన్నారు.

click me!