పో.. పో.. పక్కకెళ్లు..! జో రూట్ అవి మార్చుకుంటుండగా కిందకు వచ్చిన స్పై కెమెరా.. వీడియో వైరల్

Published : Dec 19, 2021, 07:08 PM IST
పో.. పో.. పక్కకెళ్లు..! జో రూట్ అవి మార్చుకుంటుండగా కిందకు వచ్చిన స్పై కెమెరా.. వీడియో వైరల్

సారాంశం

Joe Root: అడిలైడ్ వేదికగా జరుగుతున్న యాషెస్ రెండో టెస్టులో ఇంగ్లాండ్ సారథి జో రూట్  బ్యాట్ తో పెద్దగా మురిపించకపోయినా.. ఓ ఫన్నీ ఇన్సిడెంట్ తో మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు.

యాషెస్ సిరీస్ లో విజయాలు అపజయాల సంగతి పక్కనబెడితే మ్యాచ్ సందర్భంగా జరుగుతున్న పలు ఘటనలు అభిమానులకు ఫుల్ ఫన్ ను పంచుతున్నాయి. తాజాగా  ఇంగ్లాండ్ సారథి జో రూట్.. బాక్సర్స్ మార్చుకుంటుండగా అక్కడే ఉన్న స్పైడర్ కెమెరా అతడి మీదకు వచ్చింది. దానిని చూస్తూ రూట్ చేసిన సైగలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.  అడిలైడ్ లో జరుగుతున్న రెండో టెస్టులోని నాలుగో రోజు ఆటలో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఈ మ్యాచులో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్..  వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది.  దీంతో సెకండ్ డౌన్ లో బ్యాటింగ్ వచ్చిన రూట్ సంయమనంతో ఆడాడు. ఆ క్రమంలో అతడు తన బాక్సర్లను మార్చుకున్నాడు. ఆ సమయంలో స్పైడర్ కెమెరా ఒకటి రూట్ కు దగ్గరగా వచ్చింది. 

 

దానిని చూసిన రూట్.. ‘ఇక్కడ నీకేం పని..  పైకెళ్లు.. పైకెళ్లు..’ అంటూ సైగ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. ఇటీవలే ఇండియా-న్యూజిలాండ్ మధ్య ముంబైలో జరిగిన  రెండో టెస్టులో కూడా స్పై కెమెరా కిందకు రాగా.. దానితో అశ్విన్, విరాట్ కోహ్లీలు చేసిన ఫన్ కూడా వైరలైంది. 

ఇక మ్యాచ్ విషయానికొస్తే..  ఇంగ్లాండ్ ది మళ్లీ అదే వ్యథ. యాషెస్  సిరీస్ లో భాగంగా ఇప్పటికే తొలి టెస్టు ఓడిన  పర్యాటక జట్టు.. తాజాగా  అడిలైడ్ టెస్టులో కూడా ఓడే ప్రమాదంలో ఉంది. ఆసీస్ నిర్దేశించిన 468 పరుగుల లక్ష్య ఛేదనలో.. నాలుగో  రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్.. 43.2 ఓవర్లలో  4 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. ఓపెనర్లు రోరీ బర్న్స్ (34),  హసీబ్ హమీద్ (0) తో పాటు ఆ జట్టు బ్యాటింగ్ కు వెన్నెముకగా ఉన్న డేవిడ్  మలన్ (20), సారథి జో  రూట్ (24) కూడా పెవిలియన్ చేరారు. 

 

ఇంగ్లీష్ జట్టులో మిగిలుంది  బెన్ స్టోక్స్, ఓలీ పోప్, జోస్ బట్లర్  మాత్రమే. భీకర జోరు మీదున్న కంగారూల  పేస్ దళాన్ని తట్టుకుని  ఈ ముగ్గురు ఆట చివరిరోజైన  సోమవారం ఎంత సేపు నిలబడగలుగుతారనేది ఆసక్తికరంగా మారింది.  ఓటమిని  తప్పించుకోవాలంటే ఆ జట్టు రోజంతా ఆడి 386 పరుగులు చేయాల్సి ఉంది. ఆసీస్ బౌలర్ల జోరు చూస్తుంటే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇంగ్లాండ్ ఓటమిని తప్పించడం అసాధ్యం. 

డేవిడ్ మలన్ ను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టుకు కరోనా... 

యాషెస్ లో కరోనా కలకలం రేపుతుంది. ఇప్పటికే ఆసీస్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా కరోనా సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉండి రెండో టెస్టుకు దూరం కాగా.. తాజాగా ఇంగ్లాండ్ ఆటగాడు  డేవిడ్ మలన్ ను ఇంటర్వ్యూ చేసిన ఓ జర్నలిస్టుకు కరోనా సోకింది. బీబీసీ స్టాఫర్ గా పనిచేస్తున్న ఆస్ట్రేలియాకు చెందిన పీటర్  లాలోర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఇంటర్వ్యూ చేసే సమయంలో  పీటర్.. ముఖానికి మాస్కు ధరించాడు. కాగా, రిపోర్టర్ కు  కరోనా సోకడంతో  స్థానికంగా ఉండే ఏబీసీ అనే బ్రాడ్ కాస్టర్ తో పాటు ఇతర నెట్ వర్క్ లు కూడా.. తమ సిబ్బందిని హోటల్ లోనే ఉండాలని ఆదేశించాయి. వాళ్లలో పలువురు పీటర్ తో సన్నిహితంగా మెలిగినట్టు వార్తలు వస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !