
ఫ్రాంఛైజీ క్రికెట్ సెగ ఇంగ్లాండ్‌ని కూడా తాకుతోంది. ఇంగ్లాండ్ బ్యాటర్ అలెక్స్ హేల్స్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. 34 ఏళ్ల అలెక్స్ హేల్స్, ఇప్పటిదాకా 11 టెస్టులు, 70 వన్డేలు, 75 టీ20 మ్యాచులు ఆడాడు...
2016లో ఇండియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరిన ఇంగ్లాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్న అలెక్స్ హేల్స్, 2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో 212 పరుగులు చేసి... ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు..
‘నా దేశం తరుపున మూడు ఫార్మాట్లలో కలిపి 156 మ్యాచులు ఆడే అవకాశం రావడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఇంగ్లాండ్ జట్టు తరుపున నేను కొన్ని మధురమైన అనుభవాలను, కొందరు ఆత్మీయ స్నేహితులను సొంతం చేసుకున్నా.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని అనుకుంటున్నా..
ఇంగ్లాండ్ జెర్సీ వేసుకున్న ప్రతీ సారీ నేను గర్వంతో ఉప్పొంగిపోయా, ఓటమి ఎదురైనప్పుడు బాధతో కృంగిపోయా. ఈ ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. ఇంగ్లాండ్ తరుపున నేను ఆడిన ఆఖరి మ్యాచ్, వరల్డ్ కప్ విన్నింగ్ ఫైనల్ కావడం నాకు చాలా గర్వంగా ఉంది..’ అంటూ రిటైర్మెంట్ స్టేట్‌మెంట్‌లో రాసుకొచ్చాడు అలెక్స్ హేల్స్..
2022 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో టీమిండియాపై 47 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 86 పరుగులు చేసిన అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్‌తో కలిసి తొలి వికెట్‌కి అజేయంగా 170 పరుగులు జోడించాడు. ఈ భాగస్వామ్యం కారణంగా టీమిండియా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి, సెమీస్ నుంచే ఇంటిదారి పట్టింది..
పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 2 బంతులాడి 1 పరుగు చేసిన అలెక్స్ హేల్స్, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలెక్స్ హేల్స్ అంతర్జాతీయ కెరీర్‌లో ఇదే ఆఖరి మ్యాచ్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్, రెండోసారి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది...
వన్డేల్లో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలతో 2419 పరుగులు చేసిన అలెక్స్ హేల్స్, టెస్టుల్లో 5 హాఫ్ సెంచరీలతో 573 పరుగులు చేశాడు. టీ20 మ్యాచుల్లో ఓ సెంచరీ, 12 హాఫ్ సెంచరీలతో 2074 పరుగులు చేశాడు..ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడిన అలెక్స్ హేల్స్, 2023 సీజన్ నుంచి తప్పుకున్నాడు...
బిగ్ బాష్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, సౌతాఫ్రికా20, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 వంటి టోర్నీల్లో అలెక్స్ హేల్స్‌కి మంచి రికార్డు ఉంది. అయితే ఐపీఎల్‌లో మాత్రం అతనికి చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు.
ఐపీఎల్ 2018లో కేకేఆర్ తరుపున 6 మ్యాచులు ఆడిన అలెక్స్ హేల్స్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎక్కువగా రిజర్వు బెంచ్‌కే పరిమితం కావడంతో అతను ఐపీఎల్ 2023 సీజన్ ఆడడానికి కూడా ఇష్టపడలేదు..
ఫ్రాంఛైజీ క్రికెట్ లీగ్‌లతో యమా బిజీగా గడుపుతున్న అలెక్స్ హేల్స్, జాతీయ టీమ్‌కి సమయం కేటాయించలేకపోవడం వల్లే రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు..
టీ20 చరిత్రలో 378 మ్యాచులు ఆడిన అలెక్స్ హేల్స్, 5 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలతో 10,634 పరుగులు చేశాడు. అయితే అలెక్స్ హేల్స్‌కి ఐపీఎల్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం విశేషం..