ENG vs NZ: 40 పరుగులకే ఆరుగురు ఔట్.. లార్డ్స్ టెస్టులో కివీస్ కు చుక్కలు చూపెడుతున్న ఇంగ్లాండ్

Published : Jun 02, 2022, 05:40 PM IST
ENG vs NZ: 40 పరుగులకే ఆరుగురు ఔట్.. లార్డ్స్ టెస్టులో కివీస్ కు చుక్కలు చూపెడుతున్న ఇంగ్లాండ్

సారాంశం

England vs New Zealand 1st Test: కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ మెక్ కల్లమ్ ల మార్గదర్శకత్వంలో ఇంగ్లాండ్ బౌలర్లు న్యూజిలాండ్ కు చుక్కలు చూపిస్తున్నారు. 40 పరుగులు కూడా చేయకుండానే కివీస్ ఆరు వికెట్లను కోల్పోయింది. 

లార్డ్స్ టెస్టు లో ఇంగ్లాండ్ బౌలర్లు అదరగొడుతున్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2021-23 సీజన్ లో భాగంగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు లో ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి  కివీస్ ఆటగాళ్లు పెవిలియన్ బాటపట్టారు. ఆట ప్రారంభమై.. ప్రేక్షకులు ఇంకా సీట్లలో సర్దుకోకముందే  న్యూజిలాండ్ కు చెందిన ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్ కు చేరారు. 21 ఓవర్లలో 36 పరుగులకే న్యూజిలాండ్ ఆరుగురు కీలక బ్యాటర్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కొత్త బంతితో జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, మ్యాటీ పాట్స్ లు నిప్పులు చెరుగుతున్నారు. 

లార్డ్స్ టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ నిర్ణయం ఎంత తప్పో ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్ కు తొందర్లోనే తెలిసొచ్చింది.  స్కోరు బోర్డుపై ఒకే పరుగు చేరిన తర్వాత న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ (1) ను అండర్సన్ ఔట్ చేశాడు. 

ఆ తర్వాత ఓవర్లో అండర్సన్ కివీస్ కు మరో షాకిచ్చాడు. మరో ఓపెనర్ టామ్ లాథమ్ (1) ను కూడా పెవిలియన్ కు పంపాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఏడో ఓవర్లో తొలి బంతికి డెవాన్ కాన్వే (3) కూడా డగౌట్ కు చేరాడు. ఆదుకుంటాడనుకున్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. 22 బంతులాడి 2 పరుగులే చేసి  పాట్స్ బౌలింగ్ లో ఫోక్స్ కు క్యాచ్ ఇచ్చాడు.  10 ఓవర్లకు కివీస్ 4 వికెట్లు కోల్పోయి 12 పరుగులు చేసింది.

 

మరికొద్దిసేపటికే డారిల్ మిచెల్ (13) ను పాట్స్ క్లీన్ బౌల్డ్ చేయడంతో కివీస్ ఐదు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత పాట్స్.. బ్లండెల్ (14) ను కూడా అదేరీతిలో వెనక్కి పంపాడు. దీంతో బ్లాక్ క్యాప్స్.. 36 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయారు. 

 

24 ఓవర్లు ముగిసేసరికి కివీస్.. 6 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. ప్రస్తుతం కొలిన్ డి గ్రాండ్ హోమ్ (1 నాటౌట్), కైల్ జెమీసన్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్ల జోరు చూస్తుంటే కివీస్ వంద పరుగులు చేసినా అద్భుతమే.  పాట్స్ 3 వికెట్లు తీయగా.. అండర్సన్ 2, బ్రాడ్ 1 వికెట్ పడగొట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?