
టీమిండియా మళ్లీ అంతర్జాతీయ మ్యాచులను పట్టాలెక్కించనుంది. ఈ నెల 9 నుంచి దక్షిణాఫ్రికా తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభం కానున్నది. అది ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ (మధ్యలో ఐర్లాండ్ తో రెండు మ్యాచులు) పర్యటన ముగించుకున్న తర్వాత టీమిండియా.. అక్కడ్నుంచి నేరుగా కరేబియన్ దీవులకు వెళ్లనున్నది. జులై 22 నుంచి ఆగస్టు 7 వరకు టీమిండియా.. వెస్టిండీస్ తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే వెస్టిండీస్ లో జరుగబోయే మ్యాచులను ఇప్పట్లోలాగా బీసీసీఐ అధికారిక ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ లో గానీ, డిస్నీ హాట్ స్టార్ లో గానీ చూడటం కుదరదు.
భారత జట్టు వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల బోర్డులు షెడ్యూల్ ను ప్రకటించాయి. మూడు వన్డేలను పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని క్వీన్స్ పార్క్ ఓవల్ లో నిర్వహించనున్నారు.
టీ20 సిరీస్ లో భాగంగా.. తొలి 3 టీ20 లను విండీస్ లో జరిపి.. చివరి రెండు మ్యాచులను అమెరికాలో నిర్వహించనుండటం గమనార్హం. యూఎస్ లోని ఫ్లోరిడాలో ఈ మ్యాచులు జరుగనున్నాయి.
కరేబియన్ దీవులలో టీమిండియా పర్యటన షెడ్యూల్ ఇలా..
వన్డే సిరీస్ :
- తొలి వన్డే : జూలై 22 (క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
- రెండో వన్డే : జూలై 24 (క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
- మూడో వన్డే : జూలై 27 (క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
(వన్డే మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభమవుతాయి)
టీ20 సిరీస్ :
- తొలి టీ20 : జూలై 29: (బ్రియాన్ లారా స్టేడియం, పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
- రెండో టీ20 : ఆగస్టు 1 (వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్ & నెవిస్)
- మూడో టీ20 : ఆగస్టు 2 (వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్ & నెవిస్)
- నాలుగో టీ20 : ఆగస్టు 6 (బ్రోవార్డ్ కౌంటీ గ్రౌండ్, ఫ్లోరిడా, అమెరికా)
- ఐదో టీ20 : ఆగస్ట్ 7 (బ్రోవార్డ్ కౌంటీ గ్రౌండ్, ఫ్లోరిడా, అమెరికా)
(టీ20 మ్యాచులు రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమవుతాయి)
లైవ్ చూడటం ఇలా..
ప్రస్తుతం బీసీసీఐ అధికారిక ప్రసారదారుగా ఉన్న స్టార్ లో అభిమానులు టీమిండియా ఆడే మ్యాచులను లైవ్ ద్వారా వీక్షిస్తున్నారు. కానీ విండీస్ తో సిరీస్ లో మాత్రం మ్యాచులు అందులో రావు. క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) తాజా నిబంధనల ప్రకారం.. అక్కడ ప్రైవేట్ శాటిలైట్ నెట్ వర్క్ ఛానెల్స్ కు మ్యాచులను లైవ్ ప్రసారం చేసే అవకాశం లేదు. వెస్టిండీస్ తో సిరీస్ ను డ్రీమ్ 11 కు సంబంధించి వాళ్లకు సొంతంగా ఉన్న ఓటీటీ ఫ్లాట్ఫాం ‘ఫ్యాన్ కోడ్’ యాప్ లో మాత్రమే లైవ్ లో ప్రసారమవుతాయి. ఫ్యాన్ కోడ్.. సీడబ్ల్యూఐ అధికారిక ప్రసారదారుగా వ్యవహరిస్తున్నది. ఫ్యాన్ కోడ్ తో సీడబ్ల్యూఐ.. నాలుగేండ్ల ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే భారత మ్యాచులు కాబట్టి డీడీ ప్రసార భారతి (డీడీ స్పోర్ట్స్) లో ఈ మ్యాచులను టీమిండియా అభిమానులు వీక్షించే సౌలభ్యముంది.