
ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య లార్డ్స్ లో జరుగుతున్న తొలి టెస్టు లో ఆతిథ్య జట్టు కూడా పర్యాటక జట్టునే అనుసరించింది. 116 పరుగులతో రెండో రోజు ప్రారంభించిన ఇంగ్లాండ్.. ఆట రెండో ఓవర్లోనే స్టవర్ట్ బ్రాడ్ వికెట్ ను కోల్పోయింది. ఆ వెంటనే ఫోక్స్, పార్కిన్సన్ కూడా పెవిలియన్ బాట పట్టడంతో ఇంగ్లాండ్.. 42.5 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ రెండు జట్ల బౌలర్ల జోరు చూస్తుంటే ఈ మ్యాచ్ కు మూడు రోజుల్లోనే ముగింపు పడేలా కనిపిస్తున్నది.
తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్.. 40 ఓవర్లలో 132 పరుగులకే చాప చుట్టేసింది. కివీస్ బ్యాటర్లలో గ్రాండ్ హోమ్ (42) టాప్ స్కోరర్. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. 42.5 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా 9 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ జాక్ క్రాలే (43) టాప్ స్కోరర్. కివీస్ బౌలర్ల ధాటికి ఏకంగా 8 మంది ఇంగ్లాండ్ బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పెవిలియన్ కు చేరారు.
ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ కు అండర్సన్ మళ్లీ షాకిచ్చాడు. విల్ యంగ్ (1) ను అండర్సన్.. ఔట్ చేశాడు. ప్రస్తుతం 9 ఓవర్ల ఆట ముగిసేసరికి న్యూజిలాండ్.. వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. ప్రస్తుతానికి కెప్టెన్ కేన్ విలియమ్సన్ (10 నాటౌట్), టామ్ లాథమ్ (10 నాటౌట్) ఆడుతున్నారు.