
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కు లార్డ్స్ ఘన నివాళి అర్పించింది. ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టులో భాగంగా ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు, కామెంటేటర్లు, ఇతరత్రా సిబ్బంది అంతా వార్న్ కు ప్రత్యేకమైన నివాళినిచ్చారు. 23 సెకన్ల పాటు స్టేడియమంతా చప్పట్లతో మార్మోగింది. షేన్ వార్న్ ధరించే జెర్సీ నెంబర్ 23 కావడం గమనార్హం.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 23వ ఓవర్ సందర్భంగా వార్న్ కు ఈ గౌరవం దక్కింది. ఈ స్టేడియంలో పలు కీలక మ్యాచులు ఆడిన వార్న్ కు.. 23వ ఓవర్ ప్రారంభం కాగానే ఆటగాళ్లంతా ఒకచోట గుమిగూడారు.
ఆ సమయంలో లార్డ్స్ లో ఉన్న బిగ్ స్క్రీన్ పై వార్న్ కెరీర్ కు సంబంధించిన విశేషాలతో కూడిన 23 సెకన్ల క్లిప్ ను ప్రదర్శించారు. ఆ క్లిప్ ఆగిపోయిన వెంటనే వార్న్ ఫోటోను మాత్రమే ఉంచి అతడికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లార్డ్స్ లో ఉన్న ప్రతి ఒక్కరూ లేచి నిలబడి 23 సెకన్ల పాటు చప్పట్లతో స్పిన్ దిగ్గజానికి నివాళినిచ్చారు.
కాగా ఈ ఏడాది మార్చి 4న థాయ్లాండ్ లోని తన విల్లాలో వార్న్ గుండెపోటుతో మరణించాడు. తన కెరీర్ లో 145 టెస్టులలో 708 వికెట్లు, 194 వన్డే మ్యాచులలో 293 వికెట్లు పడగొట్టాడు వార్న్.
ఇదిలాఉండగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ కు కష్టాలు తప్పలేదు. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ను 132 పరుగులకే ఆలౌట్ చేసిన ఆ జట్టు.. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చి 116 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్ చేరారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్.. న్యూజిలాండ్ కంటే 16 పరుగులు వెనుకబడి ఉంది.