కివీస్‌ని చిత్తు చేసిన ఇంగ్లాండ్... బెన్ స్టోక్స్‌ కెప్టెన్సీలో కొనసాగుతున్న జైత్రయాత్ర...

Published : Feb 19, 2023, 11:00 AM ISTUpdated : Feb 19, 2023, 11:16 AM IST
కివీస్‌ని చిత్తు చేసిన ఇంగ్లాండ్... బెన్ స్టోక్స్‌ కెప్టెన్సీలో కొనసాగుతున్న జైత్రయాత్ర...

సారాంశం

తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై 267 పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న ఇంగ్లాండ్.. ‘బజ్ బాల్’ దూకుడుకి మూడు రోజుల్లోనే చేతులు ఎత్తేసిన కివీస్.. 

ప్రస్తుతం న్యూజిలాండ్ టూర్‌లో తొలి టెస్టులో 267 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది ఇంగ్లాండ్ జట్టు. తొలి రోజు రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ని 306 పరుగులకే ఆలౌట్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 19 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కించుకున్న బెన్ స్టోక్స్ టీమ్, రెండో ఇన్నింగ్స్‌లో 374 పరుగులకి ఆలౌట్ అయ్యింది..

తొలి ఇన్నింగ్స్‌లో టామ్ బ్లండెల్ సెంచరీతో ఆదుకోవడంతో 306 పరుగులు చేసిన న్యూజిలాండ్, 394 పరుగుల భారీ లక్ష్యఛేదనలో రెండో ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 

టామ్ లాథమ్ 15, డార్ల్ మిచెల్ 57, మైకేల్ బ్రాస్‌వెల్ 25 మినహా మిగిలిన కివీస్ బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు. డివాన్ కాన్వే 2, హెన్రీ నికోలస్ 7, టామ్ బ్లండెల్ 1, స్కాట్ కుజెలెజిత్ 2, నీల్ వాగ్నర్ 9, బ్లెయిర్ టిక్నర్ 8 పరుగులు చేయగా మాజీ కెప్టెన్ కేన్ విలియంసన్, ప్రస్తుత కెప్టెన్ టిమ్ సౌథీ ఇద్దరూ కూడా డకౌట్ అయ్యారు...

45.3 ఓవర్లు బౌలింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు ఒక్కటంటే ఒక్క అదనపు పరుగు కూడా ఇవ్వకపోవడం విశేషం. ఇంగ్లాండ్ వెటరన్ ఫాస్ట్ బౌలింగ్ ద్వయం జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ నాలుగేసి వికెట్లు తీసి న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ని కుప్పకూల్చారు.

స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ కలిసి 1003 వికెట్లను పూర్తి చేసుకుని, క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ద్వయంగా రికార్డు క్రియేట్ చేశారు. ఇంతకుముందు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్, స్పిన్నర్ షేన్ వార్న్ కలిసి 1001 వికెట్లలో భాగం పంచుకున్నారు. ఆ రికార్డును చెరిపేసింది బ్రాడ్, అండర్సన్ జోడి..

కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ బాధ్యతలు తీసుకున్నాక ఇది 8వ విజయం. వెస్టిండీస్‌ టూర్‌లో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత జో రూట్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. ఒకవేళ ఓ నాలుగైదు టెస్టులకు ముందు బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుని, ఇదే విధంగా వరుస విజయాలు అందుకుని ఉంటే ఇంగ్లాండ్ జట్టు, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలిచి ఉండేది..

జో రూట్ కెప్టెన్సీలో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో 12 మ్యాచులు ఆడిన ఇంగ్లాండ్ టెస్టు జట్టు, కేవలం రెండు విజయాలు మాత్రమే అందుకుని ఆఖరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో వరుస విజయాలతో ప్రస్తుతం ఐదో స్థానానికి చేరుకుంది ఇంగ్లాండ్. అయితే 47 శాతం విజయాలతో ఉన్న ఇంగ్లాండ్ టీమ్... డిఫెండింగ్ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ విన్నర్ న్యూజిలాండ్‌పై టెస్టు సిరీస్ గెలిచినా ఫైనల్ చేరే అవకాశాలు లేవు.

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !