ప్రపంచకప్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్లకు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిన ఆసీస్.. సిరీస్ గోవిందా..

Published : Oct 12, 2022, 05:49 PM IST
ప్రపంచకప్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్లకు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిన ఆసీస్.. సిరీస్ గోవిందా..

సారాంశం

AUS vs ENG: మరో వారం రోజుల్లో స్వదేశంలో మొదలుకాబోయే టీ20 ప్రపంచకప్ ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తాకింది. ఇంగ్లాండ్ చేతిలో కంగరూలు చిత్తయ్యారు. 

ఇటీవలే భారత్ చేతిలో టీ20 సిరీస్ కోల్పోయిన  ఆస్ట్రేలియాకు  మరో భారీ షాక్ తాకింది. టీ20 ప్రపంచకప్ కు ముందు తమ చిరకాల ప్రత్యర్థి  ఇంగ్లాండ్ చేతిలో  పరాజయం పాలైంది. వరల్డ్ కప్ కు ముందు ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో  వరుసగా రెండు మ్యాచ్ లను ఓడింది.  పెర్త్‌లో ముగిసిన తొలి టీ20 లో ఓడిన ఆసీస్..  కాన్‌బెర్రా వేదికగా  జరిగిన రెండో  మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో ఓడింది.  ఫలితంగా  సిరీస్ ను 0-2తో కోల్పోయింది. 

ఈ మ్యాచ్ లో  టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన బట్లర్ గ్యాంగ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో డేవిడ్ మలన్ (49 బంతుల్లో 82, 7 ఫోర్లు, 4 సిక్సర్లు), మోయిన్ అలీ (27 బంతుల్లో 44, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టోయినిస్ మూడు వికెట్లు తీయగా జంపా రెండు, కమిన్స్ ఒక వికెట్ తీశారు. 

లక్ష్య ఛేదనలో ఆసీస్  బ్యాటర్లు విఫలమయ్యారు. గత మ్యాచ్ లో రాణించిన డేవిడ్ వార్నర్ (4) ఈసారి విఫలమయ్యాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (13) కూడా అదే బాటలోనే పయనించాడు. గత కొంతకాలంగా ఫామ్ లో లేని  గ్లెన్ మ్యాక్స్‌వెల్ (8) దానిని కొనసాగించాడు. మార్కస్ స్టోయినిస్ (22) తో కలిసి మిచెల్ మార్ష్ (45 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కాసేపు పోరాడాడు. 

కానీ  బెన్ స్టోక్స్ మార్ష్ ను ఔట్ చేయగా సామ్ కరన్ స్టోయినిస్  ను పెవిలియన్ చేర్చాడు. 14.1 ఓవర్లలో 114 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆసీస్  శిబిరంలో టిమ్ డేవిడ్ (23 బంతుల్లో 40, 5 ఫోర్లు, 1 సిక్స్) ఆశలు కల్పించాడు. కానీ అతడు కూడా సామ్ కరన్ బౌలింగ్ లో ఔటవ్వడంతో  మ్యాచ్ పై ఆసీస్ ఆశలు కోల్పోయింది. చివరికి ఆ జట్టు  20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా ఇంగ్లాండ్.. 8 పరుగుల తేడాతో గెలిచింది.  ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కరన్ 3 వికెట్లు తీయగా టాప్లీ, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లీ తలా ఒక వికెట్ పడగొట్టారు. 

 

ఈ మ్యాచ్ లో విజయంతో ఇంగ్లాండ్.. మూడు మ్యాచ్ ల సిరీస్ ను 2-0తో గెలుచుకుంది. ప్రపంచకప్ కు ముందు ఆసీస్ వంటి అగ్రజట్టుపై ఇంగ్లాండ్ కు ఈ విజయం  ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేదే.  ఈ సిరీస్ లో ఆఖరి మ్యాచ్.. శుక్రవారం  ఇదే వేదికగా జరుగుతుంది. 

 

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో టాప్ 6 కాస్ట్లీ ప్లేయర్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?