
బీసీసీఐలో ఎన్నికల కోలాహలం మొదలైంది. బోర్డు అధ్యక్ష పదవితో పాటు పలు పదవులకు జరుగుతున్న ఎన్నికలకు ఈనెల 18న ఎన్నికలు జరుగనున్నాయి. అయితే పేరుకు ఎన్నికలని చెబుతున్నా.. ఇప్పటికే కీలక పదవులకు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారని తెలుస్తున్నది. బోర్డు అధ్యక్ష పదవి నుంచి దాదా తప్పుకుంటున్న (?) నేపథ్యంలో ఆ స్థానాన్ని 1983 వన్డే ప్రపంచకప్ హీరో రోజర్ బిన్నీ భర్తీ చేయనున్నాడు. ఈ మేరకు ఆయన తన నామినేషన్ కూడా దాఖలు చేశాడు.
అధ్యక్ష పదవికి బిన్నీ నామినేషన్ దాఖలు చేశాడని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపాడు. మంగళవారం ముంబైలో నిర్వహించిన సమావేశంలో గంగూలీకి సూక్తి ముక్తావళి వివరించిన బోర్డు పెద్దలు.. బిన్నీ నాయకత్వానికి కూడా ఓటేసినట్టు తెలుస్తున్నది.
రాజీవ్ శుక్లా వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘బీసీసీఐ 36వ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ నామినేషన్ దాఖలు చేశాడు. బిన్నీతో పాటు జై షా, అశిష్ షెలార్, దేవజిత్ సైకియా లు నామినేషన్లు దాఖలు చేశారు. అరుణ్ ధుమాల్ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (పాలకమండలి) హెడ్ గా ఉండనున్నాడు. అభిషేక్ ధాల్మియా (జగ్మోహన్ ధాల్మియా కొడుకు) ఐపీఎల్ పాలకమండలి సభ్యుడిగా, ఖైరుల్ జమల్ మజుందార్ అపెక్స్ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉండనున్నారు...’ అని తెలిపాడు.
బీసీసీఐ ఎన్నికలలో నామినేషన్లు సమర్పించడానికి చివరి తేదీ ఈనెల 12.అక్టోబర్ 15న పోటీలో ఎవరెవరు ఉన్నారనేది వెల్లడవుతుంది. 18 ఉదయం ఎన్నికలు నిర్వహించి సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు. అదేరోజు ముంబైలో బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) కూడా జరుగుతుంది. అయితే ఎన్నికలు ఏదో సంప్రదాయంలో భాగమే గానీ కీలక పదవుల్లో ఉండేవారు ఇప్పటికే తమ స్థానాలను ఖాయం చేసుకున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
బీసీసీఐ కొత్త కార్యవర్గం ఇదే అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ జాబితాను ఒకసారి పరిశీలిస్తే..
- రోజర్ బిన్నీ (అధ్యక్షుడు)
- రాజీవ్ శుక్లా (ఉపాధ్యక్షుడు)
- జై షా (సెక్రెటరీ)
- అశిష్ షెలార్ (ట్రెజరర్)
- దేవజిత్ సైకియా (జాయింట్ సెక్రెటరీ)
- అరుణ్ ధుమాల్ (ఐపీఎల్ చైర్మెన్)