
భారత్ తో మూడు ఫార్మాట్ల సిరీస్ లు ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభించిన ఇంగ్లాండ్.. తొలి వన్డేలో ఓడినా రెండో వన్డేలో గెలిచి సిరీస్ ను సమం చేసింది. శుక్రవారం మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్.. 118 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి వన్డేలో ఓటమికి బదులు తీర్చుకుంది. వర్షం కారణంగా 29 ఓవర్లకే కుదించిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆలౌ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ కు బ్యాటింగ్ అప్పజెప్పింది. దూకుడుగా ఆడేందుకు యత్నించిన ఓపెనర్లు జేసస్ రాయ్ (14), బెయిర్ స్టో(28) తో పాటు ఫిలిప్ సాల్ట్ (17), రూట్ (1) మోయిన్ అలీ (6) లు త్వరత్వరగా ఔటయ్యారు. దీంతో 11 ఓవర్లలో ఇంగ్లాండ్.. 72 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. జోస్ బట్లర్ (19) కూడా నిరాశపరిచాడు.
ఈ క్రమంలో లివింగ్ స్టోన్ (26 బంతుల్లో 38.. 1 సిక్స్, 3 ఫోర్లు), సామ్ కరన్ (18 బంతుల్లో 35, 2 సిక్సర్లు, 3 ఫోర్లు) తో చెలరేగి ఆడారు. ఆఖర్లో డేవిడ్ విల్లీ (21) కూడా మెరుపులు మెరిపించడంత 28.1 ఓవర్లలో ఇంగ్లాండ్ 201 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ప్రిటోరియస్ 4 వికెట్లు తీశాడు.
అనంతరం ఛేదనకు వచ్చిన సఫారీలకు టాప్లీ, విల్లీలు చుక్కలు చూపించారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (5) ను విల్లీ ఔట్ చేయగా.. జానేమన్ మలన్ (0), తొలి వన్డేలో సెంచరీ హీరో డసెన్ (0) లను టాప్లీ పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత మార్క్రమ్ (0) ను బట్లర్ రనౌట్ చేశాడు. దీంతో సఫారీలు 6 పరుగులకే 4 వికెట్లు కోల్పోయారు.
వరుసగా వికెట్లు కోల్పోతున్న తరుణంలో క్లాసెన్ (33) ఆదుకునే ప్రయత్నం చేసినా మిగిలినవారంతా అలా వచ్చి ఇలా వెళ్లడంతో సఫారీలు ఓటమిపాలవ్వక తప్పలేదు. ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్, మోయిన్ అలీలు సఫారీ టెయిలెండర్ల పనిపట్టారు. ఫలితంగా ఆ జట్టు 20.4 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇండియాతో వన్డే సిరీస్ లో కూడా తొలి మ్యాచ్ ఓడిన ఇంగ్లాండ్... రెండో వన్డేలో పుంజుకుంది. కానీ చివరి వన్డేలో మళ్లీ భారత్ సమిష్టిగా రాణించడంతో ఓడింది. మరి అదే ఫలితం ఇక్కడ పునరావృతమవుతున్నది. తొలి వన్డేలో సఫారీలు నెగ్గగా.. రెండో వన్డేలో ఇంగ్లాండ్ గెలిచింది. మరి ఇండియా-ఇంగ్లాండ్ ఫలితం రిపీట్ అయితే మాత్రం మూడో వన్డేలో ఇంగ్లాండ్ కు మరోషాక్ తప్పేలా లేదు. లీడ్స్ లో ఆదివారం మూడో వన్డే జరుగుతుంది.