
ఇటీవల కాలంలో ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు వరుస వైఫల్యాలు ఆ జట్టు సారథి జో రూట్ కు ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యంగా రెండు నెలల క్రితం ఆస్ట్రేలియా వేదికగా ఆ దేశంతో జరిగిన యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ కు ఘోర పరాజయం అతడి కెప్టెన్సీకి మాయని మచ్చగా మారింది. ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ 0-4తో దారుణ ఓటమి మూటగట్టుకుంది. దీంతో ఇంగ్లాండ్ ఆటతీరుపై ఆ జట్టు అభిమానులే గాక దిగ్గజ క్రికెటర్లు కూడా ఆగ్రహంతో ఉన్నారు. కెప్టెన్ గా రూట్ దిగిపోవాల్సిందేనని చర్చ కూడా మొదలైంది.
యాషెస్ ముగిసిన తర్వాత రూట్ కూడా ఇంగ్లాండ్ టెస్టు జట్టు పగ్గాల నుంచి తప్పుకుంటాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా అతడు మాత్రం తాను దిగిపోనని భీష్మించుకు కూర్చున్నాడు. అయితే పటిష్టమైన ఆస్ట్రేలియా సంగతి అటుంచితే వెస్టిండీస్ మీద కూడా మ్యాచులు గెలవడానికి ఇంగ్లాండ్ నానా తిప్పలు పడుతుంది.
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్.. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి రెండు టెస్టులను పేలవమైన డ్రా గా ముగించింది. రెండో టెస్టులో గెలిచే అవకాశమున్నా దానిని సద్వినియోగం చేసుకోలేదు. దీంతో రూట్ పై ముప్పేట దాడి పెరిగింది. ఇక కెప్టెన్ గా అతడి సేవలు చాలని, ఇకనైనా దిగిపోతే బెటరని ఇంగ్లాండ్ ఫ్యాన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదే విషయమై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా రూట్ కు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు అక్కడి పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి.
అలా అయితే నేనే తప్పుకుంటా : రూట్
ఈ నేపథ్యంలో రూట్ స్పందించాడు. అతడు మాట్లాడుతూ... ‘ఇంగ్లాండ్ జట్టును ముందుండి నడిపించడానికి నేను సరైన వ్యక్తిని అని ఇప్పటికీ నమ్ముతున్నాను. కానీ కోచ్ నాకు విరుద్ధంగా ఆలోచిస్తే అది కూడా ఓకే.. అది వాళ్ల (ఈసీబీ) నిర్ణయం. నేను ఇంగ్లాండ్ జట్టుకు వీరాభిమానిని. మా జట్టు భాగా ఆడటం నేను కోరుకుంటాను. అందుకోసం నా వంతుగా చేయగలిగిందంతా చేస్తాను. ఒకవేళ నేను అలా చేయలేని పరిస్థితుల్లో ఉంటే నేనే ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటా. ఒకవేళ అలా చేసినా నా జట్టు అత్యుత్తమంగా రాణించడానికి నా వంతు కృషి చేస్తాను. అందులో ఏ మార్పూ లేదు..’ అని వ్యాఖ్యానించాడు.
ఇంగ్లాండ్ జట్టుకు అత్యధిక టెస్టులలో (63) సారథిగా వ్యవహరించిన రికార్డు రూట్ పేరిట ఉంది. అయితే అతడి గణాంకాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.
కెప్టెన్ గా మొత్తం మ్యాచులు : 63
విజయాలు : 27
ఓటములు : 25 (ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో అత్యధిక ఓటములు పొందిన కెప్టెన్ గా చెత్త రికార్డు రూట్ పేరిట ఉంది)
విజయాల శాతం : 43%
కెప్టెన్ గా బ్యాటింగ్ యావరేజి : 47.23 శాతం
సారథిగా చేసిన పరుగులు : 5,290
తన కెరీర్ లో 116 టెస్టులాడిన రూట్.. 9,884 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 53 అర్థ సెంచరీలున్నాయి. అతడి ఖాతాలో ఐదు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇంగ్లాండ్ కు మూడు ఫార్మాట్లలో ప్రాతినిథ్యం వహించిన రూట్.. 2017లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. సౌతాఫ్రికాతో సిరీస్ తో ప్రారంభమైన రూట్ కెప్టెన్సీ కెరీర్ కు విండీస్ తో టెస్టు సిరీస్ ఆఖరుది కానుందా..? అంటే అందుకు సంబంధించిన వివరాలు కొద్దిరోజుల్లో బహిర్గతమవుతాయి.
ఇక గ్రెనెడ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్.. 16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. ఓపెనర్ జాక్ క్రాలే (7) తో విఫలమవగా జో రూట్ (0) డకౌట్ అయి నిరాశపరిచాడు. అంతకుముందు అంటిగ్వా, బార్బడస్ వేదికగా జరిగిన రెండు టెస్టులు డ్రా గా ముగిసిన విషయం తెలిసిందే.