Pak vs Aus: రసపట్టులో లాహోర్ టెస్టు.. భారీ లక్ష్య ఛేదనలో పాక్ శుభారంభం.. ఆసీస్ తొందరపడిందా..?

Published : Mar 24, 2022, 07:10 PM IST
Pak vs Aus: రసపట్టులో లాహోర్ టెస్టు.. భారీ లక్ష్య ఛేదనలో పాక్ శుభారంభం.. ఆసీస్ తొందరపడిందా..?

సారాంశం

Pakistan Vs Australia: పాక్-ఆసీస్ ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టు రసకందాయంలో పడింది.  సాధించాల్సిన లక్ష్యమేమీ మరీ పెద్దదిగా లేకపోవడం..  చేతిలో పది వికెట్లు ఉండటం.. మరో రోజు ఆట మిగిలుండటంతో ఈ టెస్టులో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తున్నది. 

పాకిస్థాన్-ఆస్ట్రేలియా  మధ్య జరుగుతున్న లాహోర్ టెస్టులో ఫలితం తేలే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లాహోర్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టులో పాట్ కమిన్స్ సేన.. నాలుగో రోజు కాస్త తొందరపడి  రోజున్నర ఆట మిగిలుండగానే పాక్ కు బ్యాటింగ్ అప్పగించింది. దీంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ లో శుభారంభం చేసింది. 351 పరుగుల లక్ష్య ఛేదనలో ఆ జట్టు.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి  27 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 73 పరుగులు చేసింది. లాహోర్ టెస్టులో విజయం సాధించాలంటే పాక్.. ఇంకా 278 పరుగులు చేయాలి. మరోవైపు కంగారూలకు ఆఖరి రోజు పదివికెట్లు పడగొట్టాలి. మరి ఆసీస్ ఏం చేస్తుందో...? 

24 ఏండ్ల (1998లో ఆఖరి పర్యటన) తర్వాత పాక్ కు టెస్టు సిరీస్ ఆడటానికి వచ్చిన ఆస్ట్రేలియా చివరిదైన మూడో టెస్టులో విజయం కోసం పోరాడాల్సిందే.  తొలి మూడు రోజులు  బౌలింగ్ కు కాస్త సహకరించిన లాహోర్ పిచ్.. నాలుగో రోజు చూస్తే పక్కా బ్యాటర్లకు అనుకూలంగా మారింది.  ఆసీస్ రెండో ఇన్నింగ్స్ చూస్తే ఇది అర్థమవక మానదు. 

ఖతర్నాక్ ఖవాజా.. 

తొలి ఇన్నింగ్స్ లో  పాక్ ను 268 పరుగులకే ఆలౌట్ చేసిన ఆనందంలో రెండో ఇన్నింగ్స్  ప్రారంభించిన ఆసీస్ అదరగొట్టింది. ఈ సిరీస్ లో దుమ్మురేపుతున్న ఉస్మాన్ ఖవాజా.. మరో సెంచరీ చేశాడు. 178 బంతులాడిన ఖవాజా.. 104 పరుగులో నాటౌట్ గా నిలిచాడు. ఇది అతడి కెరీర్ లో 12వ సెంచరీ. ఇక ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో అతడు 91 పరుగులు చేసి ఔటైన విషయం తెలిసిందే.  మొత్తంగా ఈ సిరీస్ లో ఖవాజా జోరు చూస్తే అవాక్కవ్వాల్సిందే.. ఈ సిరీస్ లో వరుసగా..  97, 160, 44 నాటౌట్, 91, 104 తో మొత్తంగా 496 పరుగులు చేశాడతడు. ఇందులో రెండు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలున్నాయి. ఖవాజాది పాకిస్థానే కావడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న లాహోర్ లోనే పుట్టిన అతడి తల్లిదండ్రులు ఆసీస్ కు వలస వెళ్లడంతో  అతడు ఆ జట్టు తరఫున ఆడుతున్నాడు. 

 

ఇక రెండో ఇన్నింగ్స్ లో ఖవాజాకు తోడుగా డేవిడ్ వార్నర్ (91 బంతుల్లో 51) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు.  వీరితో పాటు లబూషేన్ (58 బంతుల్లో 36), స్టీవ్ స్మిత్ (17) ఫర్వాలేదనిపించారు.  దీంతో  నాలుగో రోజు మూడో సెషన్ కు ముందు కమిన్స్ ఆసీస్ స్కోరు 227-3 వద్ద డిక్లేర్ చేశాడు. పాక్ కు 351 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాడు. అయితే  పిచ్ బ్యాటింగ్ కు సహకరిస్తున్న వేళ మరికాసేపు   ఆసీస్ బ్యాటింగ్ చేసినా బాగుండేదని విశ్లేషకులు     అభిప్రాయపడుతున్నారు.  ఈ టెస్టును దక్కించుకోవాలంటే ఆసీస్.. ఆట ఆఖరు రోజు 10 వికెట్లు పడగొట్టాలి. 

 

పట్టుదలగా ఆడిన పాక్.. 

351 పరుగులు భారీ లక్ష్యమే అయినా దాదాపు రోజున్నర ఆట మిగిలుండటంతో పాక్ నిదానంగా ఆడింది. ఆ జట్టు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (69 బంతుల్లో 27 నాటౌట్), ఇమామ్ ఉల్ హక్ (93 బంతుల్లో 42 నాటౌట్) లు పట్టుదలగా ఆడారు.  నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ వికెట్లేమీ కోల్పోకుండా 73 పరుగులు చేసింది.  ఈ టెస్టును సొంతం చేసుకోవాలంటే ఆ జట్టు ఇంకా 278 పరుగులు చేయాలి.  అయితే నిలకడలేమికి మారుపేరుగా ఉన్న పాక్.. మళ్లీ తడబడుతుందా..?  లేక నిలిచి గెలుస్తుందో తెలియాలంటే రేపటిదాకా ఆగాల్సిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

T20 World Cup: దటీజ్ ఇషాన్ కిషన్.. వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం ఏం చేశాడో తెలుసా?
T20 World Cup: భారత జట్టులో శుభ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్.. అసలు కారణం ఇదే !