
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిపిన భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని గురువారం.. తాను సీఎస్కే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్ నుంచి తప్పుకున్న ధోని.. ఇప్పుడు ఐపీఎల్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకోవడమే గాక ఈ సీజన్ తర్వాత పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముంది. అయితే తన వారసుడిగా రవీంద్ర జడేజాకు చెన్నై పగ్గాలు అప్పజెప్పిన నేపథ్యంలో జడ్డూ కెప్టెన్ అయ్యాక తొలిసారిగా స్పందించాడు. కెప్టెన్ అయినందుకు తనకు ఒత్తిడి గానీ, భయం గానీ లేవని.. ఎంఎస్ ధోని ఉండగా తనకు భయమే అక్కర్లేదని కుండబద్దలు కొట్టాడు.
జడేజా మాట్లాడుతూ.. ‘చాలా సంతోషంగా ఉంది. అదే సమయంలో నా మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. మహీ భాయ్ కు గొప్ప వారసత్వం ఉంది. దానిని నేను మరింత ముందుకు తీసుకెళ్లాలి. అయితే ఈ విషయం (కెప్టెన్సీకి సంబంధించి) నేను పెద్దగా చింతించాల్సిన పన్లేదు...
ఎందుకంటే ధోని భయ్యా కెప్టెన్ గా మాత్రమే తప్పుకున్నాడు. అతడు ఆటగాడిగా కొనసాగుతాడు. మ్యాచులో భాగంగా నాకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా నేను వెళ్లి అతడిని అడుగుతాను. ధోని భయ్యా నాకు పెద్దన్న వంటివాడు. కెప్టెన్సీ గురించి నేనుు చింతించాల్సిన పనేలేదు. మీ ప్రేమాభిమానాలకు చాలా పెద్ద థ్యాంక్స్. మమ్మల్ని ఇలాగే సపోర్టు చేయండి.. ’ అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్కే తన ట్విట్ఱర్ ఖాతాలో పంచుకుంది.
అయితే జడేజా పైకి తనపై ఎలాంటి ఒత్తిడి లేదని అంటున్నా అతడు మాత్రం పెద్ద బాధ్యతలే మోయాల్సి ఉంది. ఎందుకంటే ఐపీఎల్ లో సీఎస్కేకు ధోని సృష్టించిన లెగసీ అలా ఉంది. ధోని కెప్టెన్సీలో 12 సీజన్లు ఆడిన (రెండేండ్లు నిషేధం) సీఎస్కే.. 11 సీజన్లలో ప్లే ఆఫ్స్ కు చేరింది. అత్యధికంగా 9 సార్లు ఫైనల్ కు చేరింది. నాలుగు సార్లు ట్రోఫీ విజేత. 2020 సీజన్ లో లీగ్ స్టేజీకే పరిమితమైన సీఎస్కే.. 2021 లో మాత్రం పుంజుకుంది. ఏకంగా ఫైనల్ కు చేరడమే గాక నాలుగో సారి ట్రోఫీని కూడా ముద్దాడింది.
ఇక మరోవైపు అండర్-19 లో కెప్టెన్ (2007లో విను మన్కడ్ ట్రోఫీలో సౌరాష్ట్రకు) గా వ్యవహరించిన జడ్డూ తర్వాత సారథ్య బాధ్యతలు నెత్తికెత్తుకోవడం ఇదే ప్రథమం. మరి 33 ఏండ్ల ఈ ఆల్ రౌండర్ చెన్నై, ధోని వారసత్వాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్తాడనేది ఇప్పుడు ఐపీఎల్ లో చెన్నై అభిమానులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ ను వేధిస్తున్న ప్రశ్న..
ఐపీఎల్ లో ధోని కెప్టెన్సీ రికార్డులు :
మ్యాచులు : 204
గెలిచినవి : 121
ఓటమి : 82
ఐపీఎల్ ట్రోఫీలు : 4 (2010, 2011, 2018, 2021)
ఐపీఎల్ ఫైనల్స్ : 9
విజయాల శాతం : 59.60%