
శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఆ దేశ క్రికెటర్ల వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. ఆటగాళ్ల ఫిట్నెస్ కు అత్యధిక ప్రాముఖ్యతనిస్తూ లంక బోర్డు త్వరలోనే కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టబోతున్నది. ఈ మేరకు బోర్డుతో కాంట్రాక్టు కుదుర్చుకున్న క్రికెటర్లందరికీ ఆదేశాలు పంపింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఫిట్నెస్ పరీక్షలో భాగంగా ప్రతి ఆటగాడు 8.10 నిమిషాల్లోనే రెండు కిలోమీటర్లు పరుగెత్తాలి. దీంతో పాటు ప్రతి నెలా స్కిన్ ఫోల్డ్ టెస్ట్ కూడా నిర్వహించనున్నారు. ఒకవేళ నిర్ణీత సమయంలో పరుగెత్తని ఆటగాళ్ల జీతాల లో కోత పెట్టనున్నారు.
వివరాల్లోకెళ్తే... ఆట కంటే ముందు ఆటగాళ్ల ఫిట్నెస్ పై దృష్టి సారించిన శ్రీలంక క్రికెట్ బోర్డు ఆ మేరకు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. 2022 జనవరి నుంచి వాటిని ప్రవేశపెట్టనున్నది. జనవరి 7న ఆటగాళ్లకు తొలి పరీక్ష ఎదురుకానున్నది. ఈ మేరకు ఆటగాళ్లందరికీ ఆదేశాలు కూడా అందాయి.
కొత్త ఫిట్నెస్ రూల్స్ ఏంటంటే...
- యోయో టెస్టు స్థానంలో 2 కిలోమీటర్ల నిబంధనను తీసుకొచ్చారు. దీని ప్రకారం.. జట్టులో ఉన్న ప్రతి ఆటగాడు 8.10 నిమిషాలలో రెండు కిలోమీటర్లు పరుగెత్తాలి.
- ఒకవేళ 8.35 నిమిషాల నుంచి 8.55 నిమిషాల మధ్య రెండు కిలోమీటర్ల దూరం పరిగెత్తితే ఆటగాళ్ల వేతనాల్లో కోత పెట్టనున్నారు. ఎంతమేర కోత విధిస్తారన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు.
- 2 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిచేయడానికి 8.55 నిమిషాల కంటే ఎక్కువ టైం పడితే వారిని జాతీయ జట్టుకు ఎంపికచేయరు.
- ప్రతి నెలా స్కిన్ టెస్టు నిర్వహించనున్నారు. ఇది బాడీ ఫ్యాట్ ను కొలిచే ఓ పరీక్ష. ఒక పరికరం ద్వారా శరీరంలోని కొవ్వును కొలుస్తారు. స్కిన్ ఫోల్డ్ టెస్టులో 70-85 కంటే తక్కువ ఉన్నవారినే తుది జట్టులో ఉంచుతారు.
2022 నుంచి శ్రీలంక కూడా తీరిక లేని క్రికెట్ ఆడనున్నది. దాంతో పాటు వచ్చే ఏడాది నుంచి 2031 దాకా ప్రతి ఏడాది ఒక ప్రపంచకప్ ఈవెంట్ ఉన్న నేపథ్యంలో ఆ జట్టు ఆటగాళ్ల ఫిట్నెస్ కు అధిక ప్రాముఖ్యతనిస్తున్నది. ఫిట్ గా లేకుంటే ఆటగాళ్లు జట్టులో ఉన్నా లేకున్నా ఏం ప్రయోజనం లేదనే భావనలో బోర్డు ఉంది. ఫిబ్రవరిలో శ్రీలంక.. ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఆ తర్వాత భారత్ తో రెండు టెస్టులు, 3 టీ20 లు ఆడనుంది.
ఇటీవలే శ్రీలంక క్రికెట్ బోర్డు.. ఆ దేశానికి చెందిన మాజీ ఆటగాడు మహేళ జయవర్దనేను కన్సల్టెంట్ కోచ్ గా నియమించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు కోచ్ గా ఉన్న మహేళ.. జాతీయ జట్టుకు పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని, జట్టు ప్రయోజనాల కోసం పనిచేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. జయవర్దనే.. వచ్చే ఏడాది 1 వ తేదీ నుంచి బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ నేపథ్యంలో కొత్త ఫిట్నెస్ నిబంధనలు రావడం యాధృశ్చికం.