ముల్తాన్ ను ముంచెత్తిన ఇసుక తుఫాను.. పాక్-విండీస్ ఆటగాళ్ల తిప్పలు

Published : Jun 13, 2022, 01:46 PM IST
ముల్తాన్ ను ముంచెత్తిన ఇసుక తుఫాను.. పాక్-విండీస్ ఆటగాళ్ల తిప్పలు

సారాంశం

PAK vs WI ODI: పాకిస్తాన్-వెస్టిండీస్ మధ్య  ఆదివారం ముగిసిన మూడో వన్డే లో  ఇసుక తుఫాను ముంచెత్తింది. మ్యాచ్ జరుగుతుండగా ఇసుక.. స్టేడియాన్ని కప్పేసింది. 

పాకిస్తాన్ లోని పలు ప్రాంతాలను ఆదివారం ఇసుక తుఫాను కమ్మేసింది. పెషావర్, రావల్పిండి తో పాటు ముల్తాన్ లో కూడా ఆదివారం సాయంత్రం సమయంలో  ఇసుక తుఫాను ఆవహించింది.  దీంతో ఇక్కడి ప్రజలతో పాటు పాకిస్తాన్-వెస్టిండీస్ ఆటగాళ్లు కూడా ఇబ్బందులు పడ్డారు.  ఉన్నట్టుండి స్టేడియం చుట్టూ  ఇసుక తుఫాను రావడంతో  ఆటగాళ్లంతా  కళ్లద్దాలు, మాస్కులతో ముఖాన్ని కప్పుకున్నారు. అవి కూడా అందుబాటులో లేని వాళ్లు  రెండు చేతులతో ముఖాన్ని మూసుకున్నారు. 

ముల్తాన్ వేదికగా పాకిస్తాన్-వెస్టిండీస్ మధ్య ఆదివారం  మూడో వన్డే జరిగిన విషయం తెలిసిందే. పాక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో (ఇన్నింగ్స్ 33వ ఓవర్లో) ఇసుక తుఫాను అకస్మాత్తుగా అక్కడి ఏరియాను కమ్మేసింది.  దీంతో ఫీల్డింగ్ చేస్తున్న  విండీస్ ఆటగాళ్లు  ఇసుక రేణువుల నుంచి తప్పించుకోవడానికి తిప్పలు పడ్డారు.  

ఇసుక తుఫాను వల్ల కాసేపు మ్యాచ్ కు కూడా అంతరాయం కలిగింది. ఐదు నిమిషాల పాటు హోరెత్తిన ఇసుక తుఫాను.. తర్వాత తెరిపినివ్వడంతో మ్యాచ్ సజావుగా సాగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

 

విండీస్ ను వైట్ వాష్ చేసిన పాక్ : 

మూడు వన్డేల సిరీస్ నిమిత్తం పాకిస్తాన్ కు వచ్చిన వెస్టిండీస్ కు బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాక్ చుక్కలు చూపించింది.  ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. నిర్ణీత  50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. షాదాబ్ ఖాన్ (86), ఇమామ్ ఉల్ హక్ (62), ఖుష్దిల్ (34) తప్ప ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. విండీస్ కెప్టెన్  నికోలస్ పూరన్ నాలుగు వికెట్లు తీయడం గమనార్హం. 

 

మోస్తారు లక్ష్య ఛేదనలో వెస్టిండీస్.. 37.2 ఓవర్లలో 216 పరుగులకే ఆలౌట్ అయింది. అకీల్ హోసేన్ (60), కార్టీ (33) మినహా విండీస్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది.  పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4 వికెట్లు తీయగా మహ్మద్ నవాజ్, హసన్ అలీ తలా రెండు వికెట్లు పడగొట్టారు.  మూడు మ్యాచుల సిరీస్ ను పాక్ 3-0తో గెలుచుకుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?