యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ! సర్ఫరాజ్ మరో సూపర్ సెంచరీ... దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో వెస్ట్ జోన్‌కి..

By Chinthakindhi RamuFirst Published Sep 24, 2022, 3:12 PM IST
Highlights

రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 585 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన వెస్ట్ జోన్... సౌత్ జోన్‌ ముందు భారీ టార్గెట్... 

దులీప్ ట్రోఫీ 2022 టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భారత యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. జైస్వాల్‌తో రెడ్ బాల్ క్రికెట్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ అజేయ శతకంతో చెలరేగడంతో వెస్ట్ జోన్ భారీ స్కోరు నమోదు చేసింది... రంజీ ట్రోఫీలో రికార్డు పర్ఫామెన్స్‌తో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్‌‌కి ఇది 8వ ఫస్ట్ క్లాస్ సెంచరీ కాగా ఆరో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న యశస్వి జైస్వాల్‌కి నాలుగో సెంచరీ కావడం విశేషం. 

దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 585 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది వెస్ట్ జోన్. యశస్వి జైస్వాల్ 323 బంతుల్లో 30 ఫోర్లు,  4 సిక్సర్లతో 265 పరుగులు చేయగా ప్రియాంక్ పంచల్ 40, అజింకా రహానే 15 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 

శ్రేయాస్ అయ్యర్ 113 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేసి అవుట్ కాగా సర్ఫరాజ్ ఖాన్ 178 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 127 పరుగులు చేశాడు. హేత్ పటేల్ 61 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు...

అంతకుముందు సౌత్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకి ఆలౌట్ అయ్యింది. యశస్వి జైస్వాల్ 1 పరుగు, ప్రియాంక్ పంచల్ 7, కెప్టెన్ అజింకా రమానే 8 పరుగులు చేసి అవుట్ కాగా శ్రేయాస్ అయ్యర్ 37, సర్ఫరాజ్ ఖాన్ 34 పరుగులు చేశారు. హేత్ పటేల్ 189 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 98 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

శామ్స్ ములానీ డకౌట్ కాగా అతిత్ సేత్ 25, తనుష్ కొటియన్ 2, చింతన్ గజా 10 పరుగులు చేసి అవుట్ కాగా జయ్‌దేవ్ ఉనద్కట్ 73 బంతుల్లో 4 ఫోర్లతో 47 పరుగులు చేశాడు. సాయి కిషోర్ 5 వికెట్లు తీయగా బాసిల్ తంపి, స్టీఫెన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.

సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కున్నుమల్ 31, మయాంక్ అగర్వాల్ 9, కెప్టెన్ హనుమ విహారి 25 పరుగులు చేయగా బాబా ఇంద్రజిత్ 125 బంతుల్లో 14 ఫోర్లతో 118 పరుగులు చేశాడు. మనీశ్ పాండే 48 పరుగులు చేయగా రవితేజ 34, కృష్ణప్ప గౌతమ్ 43 పరుగులు చేశారు. వెస్ట్ జోన్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్ 4 వికెట్లు తీయగా అతిత్ సేత్‌కి 3 వికెట్లు దక్కాయి.

529 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన సౌత్ జోన్, 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ 14, హనుమ విహారి 1, బాబా ఇంద్రజిత్ 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 

click me!