చరిత్ర మరువని రోజు.. నవశకానికి నాంది పడ్డ క్షణాలవే.. ధోని సేన తొలి ప్రపంచకప్‌కు 15 ఏండ్లు..

By Srinivas MFirst Published Sep 24, 2022, 3:02 PM IST
Highlights

On This Day in 2007: సరిగ్గా పదిహేనేండ్ల క్రితం ఇదే రోజు భారత క్రికెట్ సరికొత్త మలుపు తిరిగింది.  క్రికెట్ ప్రపంచంలో అప్పుడే దూసుకొచ్చిన పొట్టి ప్రపంచకప్ లో భారత జట్టు సత్తా చాటింది. 

కొత్తొక వింత పాతొక రోత అన్న మాదిరిగా క్రికెట్ లో అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న టీ20  ఫార్మాట్ ఐసీసీని ఆకర్షించి.. ఈ విధానంలో   ప్రపంచకప్ కూడా నిర్వహించాలని సంకల్పించింది. అనుకున్నవిధంగానే 2007 సెప్టెంబర్ లో ఈ టోర్నీ నిర్వహణ చేయాలని షెడ్యూల్ కూడా రెడీ చేసింది.  ఆ ఫార్మాట్ లో ఇంగ్లాండ్ తో పాటు మరికొన్ని జట్లు అడపాదడపా మ్యాచ్ లు ఆడినా  టీమిండియాకు మాత్రం పూర్తిగా కొత్త.  మరి ఈ టోర్నీలో భారత్ ఎలా ఆడుతుందనేది...? అందరి మదిని తొలిచిన ప్రశ్న. అదీగాక అంతకుముందే  2007 వన్డే ప్రపంచకప్ లో భారత్  (రాహుల్ ద్రావిడ్ కెప్టెన్)  గ్రూప్ స్టేజ్ లోనే నిష్క్రమించి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. 

కానీ టీ20 ప్రపంచకప్ కు దిగ్గజ ఆటగాళ్లుగా ఉన్న సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లేరు. వీరూ, గంభీర్, సెహ్వాగ్ లు ఉన్నా వారికీ టీ20 ఆడిన అనుభవం లేదు. కెప్టెన్ గా నియమించిన ధోనికి అంతకముందు తన సొంత రాష్ట్ర జట్టుకు సారథిగా వ్యవహరించిన అనుభవం కూడా లేదు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని, జట్టును నమ్మారు. 

ధోని సారథ్యంలో యంగ్ టీమిండియా అద్భుతాలు చేసింది. గ్రూప్-డి లో ఉన్న భారత్.. తొలి మ్యాచ్ పాకిస్తాన్ తో.  పాక్ ను ఓడించిన టీమిండియా తర్వాత న్యూజిలాండ్ చేతిలో ఓడింది. కానీ  మళ్లీ ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో పుంజుకుంది. ఇంగ్లాండ్ తో పాటు సౌతాఫ్రికాను ఓడించి సెమీస్ కు చేరింది. సెమీస్ లో ఆస్ట్రేలియానూ మట్టికరిపించి ఫైనల్ చేరింది. 

ఫైనల్ లో  భారత జట్టుకు మ్యాచ్ కు ముందే షాక్ తగిలింది. డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గాయం కారణంగా మ్యాచ్ ఆడలేదు.  వీరూ లేని లోటు స్పష్టంగా కనపడింది. కానీ గౌతం గంభీర్.. పాకిస్తాన్ తో ఫైనల్ లో  54 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత సారథి  రోహిత్ శర్మ.. చివర్లో వచ్చి 16 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పాక్ ముందు 158 పరుగుల లక్ష్యం.  

కానీ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ కూడా తడబడింది. ఇమ్రాన్ నజీర్ (33), యూనిస్ ఖాన్ (24) లు మినహా టాపార్డర్ విఫలమైంది. కానీ  మిస్బాఉల్ హక్  (43) మాత్రం  లోయరార్డర్ బ్యాటర్లతో జట్టును విజయానికి చేరువ చేశాడు.

 

🗓️ in 2⃣0⃣0⃣7⃣

Led by , created history as they clinched the ICC World T20 Trophy. 🏆 👏 pic.twitter.com/Iww2KUvrHa

— BCCI (@BCCI)

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లలో ఎప్పటిలాగే ఈ మ్యాచ్ లో కూడా ఆఖరి ఓవర్ డ్రామా నడిచింది. చివరి ఓవర్లో 13 పరుగులు చేస్తే పాక్ విజయం. రెండో బంతికి మిస్బాఉల్ హక్ సిక్సర్ కొట్టడంతో పాక్ స్కోరు 152-9కి చేరింది. కానీ మూడో బంతిని మిస్బా.. స్కూప్ ఆడబోయాడు. బంతి వెళ్లి శ్రీశాంత్ చేతుల్లో పడింది. అంతే.. ఇక మిగిలిందంతా చరిత్రే..

టీ20 ప్రపంచకప్ గెలిచిన వారిలో చాలా మంది ఆటగాళ్లు తర్వాత ఐదారేండ్ల పాటు భారత జట్టు విజయాల్లో కీలక భూమిక పోషించారు.  ఈ జట్టులోని ధోని, వీరూ, యువరాజ్, గంభీర్, భజ్జీ లు 2011 వన్డే ప్రపంచకప్ కూడా ఆడి  భారత్ కు మరో ట్రోఫీని అందించారు. 

click me!