పృథ్వీ షా సెంచరీ, డబుల్ సెంచరీలు బాదిన యశస్వి జైస్వాల్, అజింకా రహానే... భారీ స్కోరు దిశగా...

By Chinthakindhi RamuFirst Published Sep 9, 2022, 6:40 PM IST
Highlights

దులీప్ ట్రోఫీలో నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీలతో మెరిసిన యశస్వి జైస్వాల్, అజింకా రహానే... సెంచరీ చేసి అవుటైన పృథ్వీ షా... 

పేలవ ఫామ్‌తో టీమ్‌లో చోటు కోల్పోయిన తర్వాత టెస్టు స్పెషలిస్టు ప్లేయర్లు ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే... బ్యాటుతో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నారు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయిన ఛతేశ్వర్ పూజారా, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో శతకాల మోత మోగించి 1000+ పరుగులు చేశాడు.

ఆ తర్వాత రాయల్ లండన్ వన్డే కప్ టోర్నీలోనూ 600+ పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, ఫ్యాన్స్‌తో పాటు టీమిండియా మేనేజ్‌మెంట్‌ని కూడా ఆశ్చర్యానికి గురి చేశాడు. తాజాగా పేలవ ఫామ్‌తో టీమ్‌లో ప్లేస్ మాత్రమే కాకుండా టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ కూడా కోల్పోయాడు అజింకా రహానే...

ఫామ్ నిరూపించుకునేందుకు రంజీ ట్రోఫీలో ఆడినా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అజింకా రహానే, ఐపీఎల్ 2022 టోర్నీలో గాయపడి మధ్యలోనే సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఛతేశ్వర్ పూజారా, ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో ఆడినా అజింకా రహానే మాత్రం గాయం కారణంగా ఆ మ్యాచ్‌కి దూరంగా ఉన్నాడు...

ఎట్టకేలకు దులీప్ ట్రోఫీ 2022 టోర్నీలో ఫామ్‌లోకి వచ్చాడు అజింకా రహానే. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న వెస్ట్ జోన్... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 590 పరుగుల భారీ స్కోరు చేసింది...

యంగ్ సెన్సేషనల్ ఓపెనర్ పృథ్వీ షా 121 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 113 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పృథ్వీ షా, లెటెస్ట్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ కలిసి తొలి వికెట్‌కి 206 పరుగులు జోడించారు. ఆ తర్వాత కెప్టెన్ అజింకా రహానే, యశస్వి జైస్వాల్... నార్త్ ఈస్ట్ జోన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ ఇద్దరూ డబుల్ సెంచరీలతో చెలరేగి రెండో వికెట్‌కి 333 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు...

యశస్వి జైస్వాల్ 321 బంతుల్లో 22 ఫోర్లు, 3 సిక్సర్లతో 228 పరుగులు చేసి అవుట్ కాగా కెప్టెన్ అజింకా రహానే 264 బంతుల్లో 18 ఫోర్లు, 6 సిక్సర్లతో 207 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. అజింకా రహానేకి ఇది మూడో ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ. ఇంతకుముందు 2008లో ఒరిస్సా, 2009లో హైదరాబాద్‌పై డబుల్ సెంచరీలు చేశాడు అజింకా రహానే. రహానేతో కలిసి రాహుల్ త్రిపాఠి 38 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసి క్రీజులో నిలిచాడు.

వెస్ట్ జోన్ తరుపున ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్, ఈ మ్యాచ్‌లో రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు. మరో క్వార్టర్ ఫైనల్‌లో ఈస్ట్ జోన్, నార్త్ జోన్ తలబడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 397 పరుగులకి ఆలౌట్ అయ్యింది. విరాట్ సింగ్ 117 పరుగులు చేయగా షాబాజ్ అహ్మద్ 62, సుదీప్ గరామీ 68 పరుగులు చేశారు. భారత బౌలర్ నవ్‌దీప్ సైనీ 3 వికెట్లు తీయగా నిశాంత్ సింధుకి 3 వికెట్లు దక్కాయి. 

click me!