
ఆస్ట్రేలియా వైట్ బాల్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడు. కొన్నాళ్లుగా సరైన ఫామ్‌లో లేక పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్న ఆరోన్ ఫించ్... అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్‌కి నెల సమయం మాత్రమే ఉండడంతో ఫించ్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటాడా? లేక వన్డే ఫార్మాట్ నుంచే తప్పుకుంటాడా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది...
టీ20ల్లో తిరుగులేని రికార్డులు క్రియేట్ చేసిన ఆరోన్ ఫించ్, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 900 పాయింట్లు దక్కించుకున్న మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఆరోన్ ఫించ్ కెప్టెన్సీలో 2021 టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా... 2019 వన్డే వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ చేరింది...
తన క్రికెట్ కెరీర్‌లో 5 టెస్టులు ఆడిన ఆరోన్ ఫించ్, 2 హాఫ్ సెంచరీలతో 278 పరుగులు చేశాడు. 144 వన్డేల్లో 5401 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్, 50 ఓవర్ల ఫార్మాట్‌లో 39.42 సగటుతో 17 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు చేసింది. 92 టీ20 మ్యాచుల్లో 2855 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్, 2 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు...
కెప్టెన్‌గా టీ20ల్లో 65 మ్యాచులు ఆడి 35 విజయాలు అందుకున్న ఆరోన్ ఫించ్, 52 వన్డేల్లో 28 విజయాలు అందించాడు. కొన్ని నెలలుగా ఆరోన్ ఫించ్ కనీస పరుగులు కూడా చేయలేకపోతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో 5 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్, రెండో వన్డేలో డకౌట్ అయ్యాడు. ఈ ఏడాది 13 వన్డేలు ఆడిన ఆరోన్ ఫించ్... ఐదు సార్లు డకౌట్ కావడం విశేషం..
ఐపీఎల్‌లో అత్యధిక ఫ్రాంఛైజీలకు ఆడిన ప్లేయర్‌గా ఆరోన్ ఫించ్ రికార్డు క్రియేట్ చేశాడు. 2010లో రాజస్థాన్ రాయల్స్‌కి ఆడిన ఆరోన్ ఫించ్, ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, పూణే వారియర్స్ ఇండియా, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ వంటి జట్లకి ఆడాడు...
డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి వేదిక ఇవ్వనుంది. స్వదేశంలో జరుగుతున్న టోర్నీ కావడంతో ఈసారి ఆసీస్ టైటిల్ ఫెవరెట్ టీమ్ కూడా. అయితే కీలక టోర్నీకి నెల రోజుల ముందు ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ తీసుకుంటే... వైట్ బాల్ క్రికెట్‌లో కొత్త కెప్టెన్‌ని వెతుక్కోవాల్సిన పరిస్థితిలో పడుతుంది ఆసీస్...
దీంతో ప్రస్తుతానికి వన్డేల నుంచి తప్పుకుని, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని ఆరోన్ ఫించ్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆరోన్ ఫించ్ తప్పుకుంటే ఆస్ట్రేలియా తర్వాతి వైట్ బాల్ కెప్టెన్ ఎవ్వరనేది కూడా ఆసక్తికరంగా మారింది...
గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో పాటు డేవిడ్ వార్నర్ పేర్లు ఆసీస్ తర్వాతి కెప్టెన్ పోటీదారులుగా వినిపిస్తున్నాయి. అయితే సాండ్‌పేపర్ వివాదం తర్వాత డేవిడ్ వార్నర్, మళ్లీ కెప్టెన్సీ చేయకుండా జీవితకాల నిషేధం విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా.