ఒక్క ఛాన్స్ ఇస్తావా..? నిన్ను గర్వపడేలా చేస్తా..! ఉనద్కట్ పాత ట్వీట్ వైరల్

By Srinivas MFirst Published Dec 10, 2022, 4:50 PM IST
Highlights

BANvsIND: వెటరన్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ తొలిసారిగా  2010లో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. 2010లో భారత జట్టు సౌతాఫ్రికా టూర్ కు వెళ్లగా సెంచూరియన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో  జయదేవ్ ఆడాడు. 
 

బంగ్లాదేశ్  పర్యటనలో ఉన్న టీమిండియా నేటితో ముగియనున్న మూడో వన్డే తర్వాత ఈనెల 14 నుంచి రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం తొలుత ఎంపిక చేసిన  మహ్మద్ షమీకి గాయమవడంతో  భారత జట్టు జయదేవ్ ఉనద్కట్  కు పిలుపునిచ్చింది. దేశవాళీలో మెరుస్తున్న  ఉనద్కత్‌కు అవకాశమివ్వడం అందరికీ ఆశ్చర్యం కలిగించినా ఈ వెటరన్ పేసర్ మాత్రం  దేశవాళీలో తానెంటో నిరూపిస్తూనే ఉన్నాడు. పన్నెండేండ్ల తర్వాత   జాతీయ జట్టులోకి చోటు దక్కిన నేపథ్యంలో అతడు గతంలో చేసిన ఓ ట్వీట్  ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 

ఉనద్కట్ తొలిసారిగా  2010లో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. 2010లో భారత జట్టు సౌతాఫ్రికా టూర్ కు వెళ్లగా సెంచూరియన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో  జయదేవ్ ఆడాడు.  ఆ మ్యాచ్ లో 26 ఓవర్లు విసిరిన  జయదేవ్.. 106 పరుగులిచ్చాడు. కానీ  ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆ తర్వాత ఉనద్కట్ ను 12 ఏండ్ల తర్వాత  జాతీయ జట్టు (టెస్టు) లోకి పిలవడం గమనార్హం. 

తనకు అవకాశాలు తగ్గిపోవడంతో  ఉనద్కట్ ఈ ఏడాది  జనవరి 4న తన ట్విటర్ ఖాతాలో.. ‘డీయర్ రెడ్ బాల్.. నాకు ఒకే ఒక్క అవకాశమివ్వు.. నేను నిన్ను గర్వపడేలా చేస్తా.. ప్రామిస్..’ అని   ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ను అప్పుడు అంతగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ  బంగ్లాదేశ్ టూర్ కు జయదేవ్ ఎంపికయ్యాడని తెలిశాక  ఈ ట్వీట్ వైరల్ గా మారింది.  

టెస్టులలో భారత్ తరఫున ఒకే మ్యాచ్ ఆడిన  ఈ సౌరాష్ట్ర వెటరన్ పేసర్.. 2013లో  భారత్  తరఫున వన్డేలలోకి ఎంట్రీ ఇచ్చాడు. 2016లో టీ20లు ఆడాడు.   అయితే దేశవాళీ క్రికెట్ లో రాణించినంతగా  ఈ  బౌలర్ జాతీయ జట్టులో ప్రభావం చూపలేకపోయాడు.   జాతీయ జట్టులో అవకాశాలు తగ్గిపోవడం, యువ బౌలర్లు దూసుకొస్తుండటంతో  జయదేవ్ కు అవకాశాలు తగ్గిపోయాయి.  దీంతో  పూర్తిగా దేశవాళీ మీదే దృష్టి కేంద్రీకరించిన  ఉనద్కట్.. ఈ సారి విజయ్ హజారే ట్రోఫీలో   సౌరాష్ట్రకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 14 ఏండ్ల తర్వాత తన జట్టుకు  ఈ ట్రోఫీని తిరిగి అందించడంలో  జయదేవ్ ది కీలక పాత్ర.  

 

Dear red ball, please give me one more chance.. I’ll make you proud, promise! pic.twitter.com/ThPUOpRlyR

— Jaydev Unadkat (@JUnadkat)

విజయ్ హాజారే ట్రోఫీలో 19 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన జయ్‌దేవ్ ఉనద్కట్, కెప్టెన్‌గా సౌరాష్ట్రకు టైటిల్ అందించాడు.  ప్రస్తుతం రాజ్‌కోట్‌లో ఉన్న జయ్‌దేవ్ ఉనద్కట్, వీసా ఫార్ములాటీలను పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో జయ్‌దేవ్ ఉనద్కట్, బంగ్లాదేశ్ చేరుకోబోతున్నాడు. జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా తప్పుకోవడం, షమీ కూడా అతని దారిలోనే సిరీస్‌కి దూరం కావడంతో జయ్‌దేవ్ ఉనద్కట్‌పై భారీ అంచనాలే పెట్టుకుంది భారత జట్టు.
 

click me!