IndW vs AusW: అదరగొడుతున్న భారత అమ్మాయిలు.. పింక్ బాల్ టెస్టులో భారీ స్కోరు.. ఎదురీదుతున్న ఆసీస్

By team teluguFirst Published Oct 2, 2021, 4:05 PM IST
Highlights

Pink Ball test: తొలి డే అండ్ నైట్ టెస్టులో భారత అమ్మాయిలు అదరగొడుతున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై తొలుత బ్యాటింగ్ లో ఇరగదీసిన భారత మహిళా ఆటగాళ్లు.. తర్వాత బౌలింగ్ లోనూ మెరుస్తున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కంగారూలు ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. 

క్వీన్స్లాండ్ వేదికగా జరుగుతున్న తొలి, ఏకైక  డే అండ్ నైట్ టెస్టులో భారత అమ్మాయిలు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత బ్యాటర్లు.. ఆసీస్ బౌలింగ్ ను తుత్తునీయలు చేస్తూ 8 వికెట్లు కోల్పోయి 377 పరుగుల భారీ స్కోరు సాధించారు. వరుసగా రెండ్రోజులుగా వర్షం కురుస్తున్నా ఏమాత్రం ఏకాగ్రత చెదరకుండా ఆడుతున్న అమ్మాయిలు.. ఆసీస్ పై చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. 

377 పరుగుల వద్ద భారత్ డిక్లేర్ చేయడంతో బ్యాటింగ్ ఆరంభించిన కంగారూలు ప్రస్తుతం 38 ఓవర్లు ముగిసే సరికి మూడు కీలక వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేశారు. ఓపెనర్ మూనీ (4) ని ఔట్ చేసి ఆదిలోనే ఆసీస్ ను దెబ్బతీసిన సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి (julan goswami).. కొద్దిసేపటికే మరో ఓపెనర్ అలిస్సా హీలీ (29) ని కూడా ఔట్ చేసింది. వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ మెగ్ లానింగ్ (38) ను పూజా వస్త్రకార్ ఎల్బీడబ్ల్యూ గా వెనక్కి పంపింది. క్రీజులో పెర్రీ (7 నాటౌట్), మెక్ గ్రాత్ (3 నాటౌట్) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 290కి పైగా పరుగులు వెనుకబడిన ఆసీస్ భారీ స్కోరును సమం చేస్తుందో లేదో వేచి చూడాలి. 

కాగా, అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్.. స్మృతి మంధాన సూపర్ సెంచరీ (127)కి తోడు దీప్త శర్మ (66),  కెప్టెన్ మిథాలీ  రాజ్ (30), పూనమ్ రౌత్ (36)లు మెరుగ్గా రాణించడంతో 377 పరుగులు చేసింది. ఆసీస్ బౌరల్లలో  పెర్రీ, క్యాంప్బెల్, మెక్ గ్రాత్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఇదిలాఉండగా.. ఈ మ్యాచ్ లో  ఆసీస్ ఆల్ రౌండర్ ఎల్లిసె పెర్రీ (ellyse perry) అరుదైన రికార్డు నెలకొల్పింది.

 

Ellyse Perry achieves a rare feat. pic.twitter.com/A8ApOGO51f

— CricTracker (@Cricketracker)

అంతర్జాతీయ క్రికెట్లో 5000 ప్లస్ పరుగులు, 300 వికెట్లు సాధించిన  క్రికెటర్ గా రికార్డు సృష్టించింది.  కాగా ఒక్కరోజు ఆట మాత్రమే మిగిలుండటంతో ఈ టెస్టు డ్రా గా ముగిసే అవకాశం ఉంది. 

click me!