ICC Media Rights: మీడియా రైట్స్ విషయంలో ఐసీసీ దూకుడు.. బీసీసీఐ ఆదాయానికి గండి..?

By team teluguFirst Published Oct 2, 2021, 2:31 PM IST
Highlights

అంతర్జాతీయ క్రికెట్ మండలి కొత్త మీడియా హక్కుల పాలసీని తీసుకురాబోతున్నది. మీడియా రైట్స్ వ్యవధిని తగ్గించేందుకు ఐసీసీ ప్రయత్నిస్తున్నది. అయితే దీని ద్వారా బీసీసీఐ ఆదాయానికి గండి పడే ప్రమాదముందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

మీడియా హక్కుల విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి దూకుడుగా వ్యవహరిస్తున్నది. గతంలో ఉన్నట్టుగా 8 సంవత్సరాల కాలానికి బదులుగా వాటిని నాలుగేండ్లకే కుదించాలని భావిస్తున్నది. దీని ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ఐసీసీ యోచిస్తున్నది. ఇందుకు సంబంధించి ఏడాది క్రితం నుంచే కసరత్తులు చేస్తున్న ఐసీసీ పెద్దలు.. వచ్చే నెల బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారని టాక్ వినిపిస్తున్నది. 

బీసీసీఐతో మీడియా హక్కుల ఘర్షణను నివారించడానికి అంతేగాక భారత బోర్డు ముందుగానే దాని స్వంత టెండర్ ను విడుదల చేయాలని ఐసీసీ భావిస్తున్నది. ఈ నెల 25న రెండు ఐపీఎల్ కొత్త జట్లను ప్రకటించనున్న బీసీసీఐ.. 2023-27 కాలానికి మీడియా హక్కులను విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించింది.

ఐపీఎల్ కు సంబంధించిన మీడియా హక్కులను స్టార్ టీవీ నెట్ వర్క్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. భారత్ తో పాటు అన్ని దేశాల్లోనూ స్టార్ నెట్వర్క్ లోనే ఐపీఎల్ ప్రసారమవుతున్నది. అయితే దీనిని దేశాల వారీగా (టెర్రిటరీ బేస్డ్) పంచాలని చూస్తున్నదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఇదే నిజమైతే బీసీసీఐ మీడియా ఆదాయానికి గండి పడినట్టే. అయితే నవంబర్  16న జరిగే బోర్డు సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిమీద ఏడాది నుంచే కసరత్తులు చేస్తున్న ఐసీసీ ముందుకే వెళ్లాలని భావిస్తున్నది.

click me!